టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ సంచలనాలకు తెరతీసింది. దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. అందులో మొదటిగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరిగే అవకాశం ఉంది. కెల్విన్ తో పూరి మాట్లాడినట్టు ఆధారాలున్నట్టు చెబుతున్నారు. డ్రగ్స్ సరఫరాదారుడైన కెల్విన్, అతని గ్యాంగ్ ఈడీ అదుపులో ఉన్నారు. చాలా వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటుచేసి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.

మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా ప్రధాన ఆరోపణలుగా ఈరోజు విచారణ జరుగుతోంది. నాలుగేళ్ల క్రితం వీరిందరినీ విచారించారు. సెప్టెంబరు 22 వరకూ సినీ ప్రముఖకుల విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సోదాలు జరపడం, ఆస్తులు జప్తుచేయడం లాంటి పరిణామాలకు అవకాశం కనిపిస్తోంది. వీరి బ్యాంక్ లావాదేవీలను కూడా సేకరించనున్నారు. నిధులు విదేశాలకు ఎలా మళ్లించారు? ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయి? టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? తదితర వివరాలన్నిటినీ సేకరించనున్నారు.
గత ఏడాది బాలీవుడ్ లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు ఆ తర్వాత శాండల్ వుడ్, ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనాలు పుట్టిస్తోంది. షికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలన్నిటినీ బట్టబయలు చేసే దిశగా ఈడీ పావులు కదుపుతోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలోనే కాకుండా ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న వారందిరిలోనూ అలజడి రేగుతోంది.
Must Read ;- ఈడీ అంటే అంత భయమెందుకో?











