ఓ వైపు కరోనా విలయం, మరో వైపు ప్రభుత్వాల సహకారం లేని వైనం.. వెరసి తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎలాగోలా ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని ఏపీలోని జగన్ సర్కారును టాలీవుడ్ పెద్దలంతా శరణువేడినంత పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్దరికం తీసుకుని మరీ జగన్ తో భేటీ అయ్యారు. జగన్ నుంచి సానుకూల స్పందన రావడంతో రెండో భేటీలో సినీ పెద్దలను వెంటేసుకుని మరీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. అప్పుడు కూడా జగన్ తన సానుకూలతనే వ్యక్తం చేయడంతో.. ఇక సమస్య నుంచి తమ పరిశ్రమ గట్టెక్కినట్టేనని టాలీవుడ్ పెద్దలంతా భావించారు. అయితే ఆ తర్వాతే జగన్ సర్కారు నిజ నైజం బయటపడిపోయింది. ఇప్పటికే రెండు దఫాలుగా చిరు బ్యాచ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ రద్దు చేసిన జగన్.. మొన్న తాడేపల్లికి వచ్చిన సినీ పెద్దల వద్దకు మంత్రి పేర్ని నానిని పంపారు. ఇక్కడి దాకా కూడా బాగానే ఉన్నా.. ఈ బేటీలో జగన్ సర్కారు తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
టికెట్ల రేట్ల పెంపుపై భరోసా లేదు
టాలీవుడ్ పెద్దలు సినిమా టికెట్ల రేట్లను పెంచుకునే దిశగా సాగుతున్నారు. ఈ ఒక్క అంశానికి జగన్ సర్కారు ఒప్పుకుంటే.. ఏపీకి సంబంధించి టాలీవుడ్ సమస్య దాదాపుగా తీరిపోయినట్టే. అయితే ఈ విషయంలో తనతో భేటీ అయిన చిరుకు జగన్ ఏమాత్రం హామీ ఇవ్వలేదు. తర్వాత మాట్లాడదాం అంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేసిన జగన్.. మొన్నటి పేర్ని నానితో భేటీలోనూ ఇదే తరహా వైఖరిని అవలంబించారట. ఈ సమావేశంలో సినీ పెద్దలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దీనిపై ఇప్పటికిప్పుడు హామీ అయితే ఇవ్వలేమని పేర్ని నాని తేల్చి చెప్పేశారట. దీంతో సినీ పెద్దలు షాక్ తిన్నారట. భేటీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానంపైనే ప్రధానంగా చర్చ జరిగిందట. టికెట్ల రేట్లు పెంచమని అడిగితే.. ఆ విషయాన్ని పక్కనపెట్టేసి టాలీవుడ్ ను మరింత కలవరపెట్టేలా ఆన్ లైన్ టికెటింగ్ విధానం.. అది కూడా ప్రభుత్వ ఆధీనంలో జరిగేలా తీసుకుంటున్న నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు నిజంగానే షాక్ తిన్నారట.
వాతలేంటంటే..?
టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి జగన్ సర్కారు నుంచి ఎలాంటి హామీ లభించకపోగా.. కొత్తగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదన్నట్లుగా జగన్ సర్కారు సినీ పెద్దలకు ఓ భారీ షాకిచ్చిందట. టికెట్ల రేట్లు పెంచమని వస్తే.. తమకు బూస్ట్ ఇస్తున్న బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తున్నట్టుగా జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై సినీ పెద్దలు నిజంగానే షాక్ తిన్నారట. మొన్న ఆన్ లైన్ టికెట్ల విక్రయాన్ని ప్రభుత్వ పరం చేసేలా నిర్ణయం తీసుకుంటే.. ఇప్పుడేమో భారీ బడ్జెట్ సినిమాలకు రక్షణగా నిలిచే బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసేలా కొత్త ప్రతిపాదనను పెట్టిన వైనం టాలీవుడ్ పెద్దలకు బిగ్ షాకే కదా. మొత్తంగా తమను ఆదుకోవాలంటూ వచ్చిన సినీ పెద్దలకు జగన్ సర్కారు తనదైన మార్కు ట్రీట్ మెంట్ తో షాకిచ్చిందన్న మాట.
Must Read ;- సీఎం జగన్, చిరంజీవి లేకుండానే మంత్రితో భేటీ