Telangana Minister KTR Has Filed A Defamation Suit Against TPCC Chief Revanth Reddy :
ఓ వైపు టీఆర్ఎస్ కార్యాధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఓ వైపు మీడియా సమావేశాలు, మరో వైపు బహిరంగ సభల వేదికగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న మాటల తూటాలు.. ఇప్పుడు ట్విట్టర్‌ను కూడా హీటెక్కిస్తున్నాయి. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారన్న కోణంలో రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తుండగా.. వాటిని నిరూపిస్తారా? అంటూ కేటీఆర్ తనదైన శైలిలో సవాళ్లు విసురుతున్నారు. మొత్తంగా గడచిన నాలుగైదు రోజులుగా సాగుతున్న వీరి పోరు సోమవారం నాడు మరో కీలక దశకు చేరుకుందని చెప్పాలి. రేవంత్ పై కేటీఆర్ ఏకంగా పరువు నష్టం దావా దాఖలు చేసేశారు. ఈ మేరకు కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు పెను వైరల్ గా మారింది.
ముందుగా రేవంత్ ట్వీట్..
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏపీలోని విజయవాడకు భారీగా డ్రగ్స్ తరలిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా గుజరాత్ లో పట్టుబడిన వైనంపై మీడియాలో వచ్చిన ఓ క్లిప్పింగ్ ను జత చేస్తూ సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో #వైట్ చాలెంజ్ పేరిట తాను ప్రారంభించిన ఉద్యమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారని, కేటీఆర్ కోసం తామంతా అమరవీరుల స్థూపం వద్ద 12 గంటల దాకా వేచి చూస్తామంటూ పేర్కొన్నారు. అంతకుముందు పలుమార్లు టాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డ్రగ్స్ దందాలో కేటీఆర్ కు కూడా పాత్ర ఉందని, ఈ విషయం త్వరలోనే వెల్లడి కానుందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా లేకున్నా.. ఆ వ్యాఖ్యలన్నీ కేటీఆర్ టార్గెట్‌గా సంధించినవేనన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో ఆ ఆరోపణలను కేటీఆర్ రెండు రోజుల క్రితం ఖండించారు. అంతేకాకుండా తానెలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, ఈ మాటను నిరూపించేందుకు తాను టెస్ట్ లకు కూడా సిద్ధమేనని, మరి ఇదే తరహాలో టెస్టులకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సిద్ధమేనా? అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టులో కేటీఆర్ దావా
ఇలాంటి నేపథ్యంలో సోమవారం తనను ఉద్దేశిస్తూ రేవంత్ ట్వీట్ చేసిన వైనాన్ని చూసిన వెంటనే కేటీఆర్ ఓ రేంజిలో ఫైరైపోయారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా రేవంత్‌తో పాటు తన ఇతర ప్రత్యర్థులు కూడా పేట్రేగిపోతారేమోనని అనుమానించిన కేటీఆర్.. హైకోర్టులో రేవంత్ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ లో రేవంత్ పై పరువు నష్టం దావా వేసిన విషయంతో పాటు.. ఈ దావా ద్వారా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడతాయన్న విశ్వాసంతో ఉన్నానని కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రేవంత్ ట్వీట్ ను చూసిన వెంటనే తీవ్రంగా స్పందించిన కేటీఆర్.. రేవంత్ కు పెను సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసులో పరీక్షలకు హాజరయ్యేందుకు తాను సిద్ధమని, ఢిల్లీలోని ఎయిమ్స్ కే వస్తానని, అయితే ఆ పరీక్షలకు రాహుల్ గాంధీ కూడా సిద్ధం కావాలని కేటీఆర్ ఓ సంచలన సవాల్ విసిరారు. ఈ పరీక్షల్లో తాను నిర్దోషినని తేలితే.. తనకు క్షమాపణ చెప్పడంతో పాటుగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు చల్లపల్లి జైల్లో శిక్ష అనుభవించిన రేవంత్ సిద్ధమేనా? అని కూడా కేటీఆర్ వైరల్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగని కేటీఆర్.. లై డిటెక్టర్ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? అని కూడా మరో సవాల్ విసిరారు. మొత్తంగా వీరిద్దరి మధ్య పోరు ఇంకెంత దూరం వెళుతుందోనన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- వామ్మో.. యముడిగా రేవంత్