కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. మహిళా సంక్షేమమే లక్ష్యంగా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తుంది. పేద, మధ్య తరగతి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వివిధ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. జిల్లాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద మహిళా లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు కలెక్టర్లను ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తోంది.
గడిచిన 8 నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 10,64,277 మంది మహిళలకు పింఛన్లు, డ్వాక్రా, దీపం 2.0 తదితర ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 వేల 418 కోట్ల ఆర్థిక ప్రయోజనాలను అందించింది ప్రభుత్వం. అలాగే 2025-26 బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.4వేల కోట్లు కేటాయించింది. దీపం-2 పథకం కింద 90.1 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసింది. డ్వాక్రా మహిళలకు మెప్మా, స్త్రీనిధి ద్వారా రూ.వేల కోట్ల రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందిస్తోంది కూటమి సర్కార్. మహిళా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో శ్రీసత్యసాయి (1,14,758 మంది), కాకినాడ (1,05,454 మంది) టాప్‌లో నిలిచాయి. అతి తక్కువ మహిళా లబ్ధిదారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా (8,923 మంది), పార్వతీపురం మన్యం జిల్లా (11,520 మంది) చివరి స్థానాల్లో ఉన్నాయి.
ఇక కర్నూలు, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువ సంఖ్యలోనే మహిళలకు ప్రయోజనాలు అందుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో లక్ష్యంలో 80 శాతం నుంచి 99 శాతం వరకు ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ జిల్లాల్లోనూ లబ్ధిదారుల సంఖ్యను 100 శాతానికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు మే నెలలో అమలు చేయనున్న తల్లికి వందనం పథకం కోసం తాజా బడ్జెట్‌లో రూ.9,407కోట్లు కేటాయించారు. దీనివల్ల మరింతమంది మహిళలకు సంక్షేమ ప్రయోజనాలు దక్కనున్నాయి.
ఇవికాకుండా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నారు. కుట్టుపనిలో 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల 175 నియోజకవర్గాల నుంచి 1,02,832 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరంతా బీసీ, EWS, కాపు సామాజిక వర్గాలకు చెందినవారు. శిక్షణ పూర్తయ్యాక వీరందరికీ ఉచితంగా కుట్టుమిషన్లను అందిస్తారు. ఈ మిషన్ల కొనుగోలుకు రూ.255కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడం కోసం కేటలిస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో సెర్ప్ అగ్రిమెంట్ చేసుకుంది. చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కెఫేతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని సెర్ప్ భావిస్తోంది. వివిధ సేవా రంగాల్లోకి మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించి వారి ఆదాయ మార్గాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిషియన్లు. ప్లంబర్లు, బ్యూటిషియన్లు, కార్పెంటర్లు, గృహోపకరణ మరమ్మతుల విభాగంలో వారికి శిక్షణ ఇప్పించేందుకు హోం ట్రయాంగిల్ కంపెనీతో మెప్మా ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల 18 వేల 515 మంది మహిళలకు ఉపాధి దొరకనుంది. దీంతో పాటు డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహించేందుకు రాపిడో సర్వీస్‌తో మెప్మా అగ్రిమెంట్ చేసుకుంది.
నైపుణ్యం, ఆసక్తి ఉన్న 1000 మంది మహిళలకు ప్రభుత్వమే ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించనుంది. PM విశ్వకర్మ పథకం ద్వారా 1,000 మంది మహిళలకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇవ్వనుంది. మహిళా సంఘాల ద్వారా అరకు కాఫీ ప్రమోషన్‌కు 100 ఔట్‌లెట్‌లు, 100 కాఫీ హోటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.