ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ప్రశంసలు కురిపించారు MRPS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియ ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిలో నిజాయితీ, చిత్తశుద్ధి లోపించిందన్నారు. దీంతో తెలంగాణలో వర్గీకరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు.
శుక్రవారం ఒంగోలుకు వచ్చిన మందకృష్ణ….మాదిగలతోపాటు, వర్గీకరణ కోరుకున్న దళిత కులాలకు చంద్రబాబుతో మేలు జరుగుతుందన్నారు. వర్గీకరణ చేసి, మరిన్ని ఫలాలు అందించాలన్న ఆయన ఆలోచనలను పరిణామాలు ప్రతిఫలిస్తున్నాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు అందగానే ఆ అంశంపై సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు మందకృష్ణ. ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తోందని చెప్పారు.
SC వర్గీకరణకు నెలరోజుల్లోనే శాశ్వత పరిష్కారం లభించనుందని చెప్పారు. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు దక్కని మాదిగ, రెల్లి, ఇతర ఉపకులాలకు త్వరలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, నోటిఫికేషన్‌లు వర్గీకరణ పూర్తయిన తర్వాతనే అమలు చేయాలని కోరారు మందకృష్ణ.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సమయంలోనూ చంద్రబాబుపై పొగడ్తలు కురిపించారు మందకృష్ణ. 30 ఏళ్లుగా వర్గీకరణ పోరాటానికి చంద్రబాబు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబునాయుడేనని ఆయన గుర్తు చేసుకున్నారు.