విశాఖపట్నం మరో భారీ ప్రాజెక్టుకు వేదికగా మారనుంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా..ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్టును ఇండియాకు తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు “ప్రాజెక్ట్ వాటర్ వర్త్‌గా పేరు పెట్టింది”. ఇది అతిపెద్ద ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థ. ఇది ఇండియాను అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలతో కనెక్ట్ చేస్తుంది. మెటా సంస్థ మన దేశంలో ముంబైతో పాటు తూర్పు తీరంలో విశాఖను ల్యాండింగ్ స్టేషన్‌గా ఎంపిక చేసుకుంది. అంటే ఇంటర్నేషనల్ డిజిటల్ మ్యాప్‌లో వైజాగ్‌కు స్పెషల్ ప్లేస్ దక్కనుంది.
సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ అంతా సముద్రంలో వేసే కేబుల్స్ ద్వారానే వస్తుంది. వైజాగ్ వరకు కొత్త కేబుల్ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం, నాణ్యత మరింత పెరగనున్నాయి. దీని ద్వారా 4K వీడియో స్ట్రీమింగ్, ఫాస్ట్ డౌన్‌లోడ్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ వంటి సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయి.ఈ ప్రాజెక్టు ఉద్దేశం కేవలం స్పీడ్ పెంచడం మాత్రమే కాదు, డిజిటల్ సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కారణంగా విశాఖ ఐటీ రంగంలో దూసుకుపోయే అవకాశం ఉంది. ఎక్కువ డేటా సామర్థ్యం అందుబాటులో ఉంటే, గూగుల్, అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే, డేటా సెంటర్ల నిర్వహణకు అత్యధిక వేగం, స్థిరత్వం కలిగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ ముఖ్యం. దీనితో విశాఖపట్నం ఒక అంతర్జాతీయ డేటా సెంటర్ హబ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
పెద్ద టెక్ కంపెనీలు, డేటా సెంటర్లు వైజాగ్ నగరానికి వస్తే, వాటితో పాటు వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నెట్‌వర్క్ నిపుణులు, డేటా సెంటర్ టెక్నీషియన్లు…ఇలా ఎంతో మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా, టెక్నాలజీ ఆధారిత చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు కూడా పెరుగుతాయి. ఈ కేబుల్ ద్వారా తూర్పు తీరంలో జరిగే వ్యాపార కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయి.
ఈ మెటా కేబుల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు డిజిటల్ ఎకానమీకి కీలకంగా మారనుంది. ముంబై తర్వాత దేశంలో ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌గా విశాఖ ఎంపిక కావడం ఏపీకి గర్వ కారణం.ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం, దేశంలోని తూర్పు తీరంలో ఒక ప్రధాన గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా మారనుంది. ఇందుకు సంబంధించి ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని మంత్రి నారా లోకేష్ షేర్ చేశారు. గతంలో గూగుల్, ఇప్పుడు మెటా అంటూ ట్వీట్ చేశారు. వాటర్ వర్త్ ప్రాజెక్టును విశాఖకు తీసుకురావాలన్న మెటా ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ ఇండియా AI కేపిటెల్‌గా మారుతుందన్నారు











