అమరావతి మంగళగిరి మయూరి టెక్‌పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను బుధవారం ప్రారంభించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు…ఏపీ ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు చంద్రబాబు. రతన్ టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమాజానికి తిరిగి ఇద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని..టాటా ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.
ఇక నేటి యువత ప్రధానంగా స్టార్టప్‌లవైపు దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి అవసరమైన సపోర్ట్ ఇచ్చే లక్ష్యంతో ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్క రోజులోనే లక్షా అరవై వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటే..యువత తమ ఆలోచనలు, స్టార్టప్‌ల కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అమరావతితోపాటు విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరాల్లో జోనల్ ఇన్నోవేషన్ హబ్‌లు.. వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహించేలా పని చేస్తాయి. వీటిని యువత వినియోగించుకోవాలన్నారు చంద్రబాబు. సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోతారన్నది అపోహ మాత్రమేనన్నారు. ప్రపంచానికి సేవలందించేలా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్నదే ఆలోచనగా చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చేవారికి అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
గతంలో ప్రతీ ఇంటికో ఐటీ ఉద్యోగం అనే నినాదంతో ఐటీకి బీజం వేసిన చంద్రబాబు..ఇవాళ ప్రతి కుటుంబం నుంచి ఓ స్టార్టప్ సృష్టికర్త రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ప్రతి బిజినెస్ ఐడియా ఒక స్టార్టప్‌నే. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారన్నదానిపైనా ఆ స్టార్టప్ సైజ్ ఆధారపడుతుంది. రాష్ట్రంలో యువతను ఈ దిశగా ప్రోత్సహించడంతో పాటు మార్గదర్శనం, నిధులు, సాంకేతిక సహాయం అందించే వీలుగా ఈ ఇన్నోవేషన్ హబ్‌లకు రూపకల్పన చేశారు. మయూరి టెక్ పార్క్‌లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటగా ఏర్పాటు చేశారు. డీప్ టెక్, ఏఐలను ఉపయోంగించుకుని ఈ సెంటర్ సిద్ధం చేశారు.
ప్రతి జోనల్ సెంటర్‌కు ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెంటార్‌గా ఉంటోంది. టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ, అదానీ, గ్రీన్‌కో, జిఎంఆర్, కియా వంటి సంస్థలు ప్రస్తుతం ఈ ఇన్నోవేషన్ సెంటర్ల విషయంలో కీలకంగా వ్యవరిస్తున్నా యి. వీటిల్లో ఔత్సాహికుల స్టార్టప్‌లకు నిధులు, ఇన్క్యుబేషన్, యాక్సిలరేషన్ కోసం ఆర్థిక మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం ఎస్క్రో ఖాతా ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించడాన్ని పరిశీలిస్తోంది. మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చడానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు , విద్యావేత్తలతో కలిసి పనిచేసే ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు.











