వైరస్ కారణంగా వ్యాధుల బారినపడడం, మరణించడం మానవుడికి కొత్తేం కాదు. ఓ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ప్రతి యేటా ఏదో ఒక వైరస్ కారణంగా వ్యాధి బారిన పడతున్నారట. వారిలో దాదాపు లక్ష మంది మరణిస్తున్నారట. `సార్స్ కోవ్-2` వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న `కోవిడ్-19` కూడా ఇతర వైరస్ ప్రభావిత వ్యాధుల్లాంటిదే. కాకపోతే ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స, గైడ్‌లైన్స్, మందులు లేవు. దీంతో ఈ వ్యాధి చికిత్సలో ఇమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తోంది.
వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారికి కరోనా వైరస్ సోకినా ప్రమాదం ఉండదని, సాధారణ ఫ్లూ లక్షణాలే కనబడతాయని, కొందరిలో ఆ లక్షణాలూ ఉండవని ఇప్పటికే రుజువైంది. దీంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచే `సీ-విటమిన్`కు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఏర్పడింది. శరీరంలో యాంటీ బాడీస్‌ను ప్రేరేపించడంలో `సీ-విటమిన్`ది కీలకపాత్ర.
విటమిన్-సి గుర్తింపు
20వ శతాబ్దం తొలి నాళ్లలోనే సి-విటమిన్‌ను గుర్తించారు. జంతువులు స్వతహాగానే ఈ విటమిన్‌ను తయారు చేసుకుంటాయని తెలుసుకున్నారు. వ్యాధి బారిన పడినపుడు దాని నుంచి కోలుకోవడానికి జంతువుల శరీరంలో 10 గ్రామలు వరకు `విటమిన్-సి` ఉత్పత్తి జరుగుతుంది. అయితే మానవులలో మాత్రం ఇది స్వతహాగా తయారు కాదు. బయటి నుంచి తీసుకోవాల్సిందే. అలాగే ఇది శరీరంలో నిలువ ఉండదు. ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా ఈ విటమిన్‌ను తీసుకోవాల్సిందే. 1970లో సాధారణ జలుబును నివారించేందుకు లైనస్ పాలింగ్ అనే శాస్త్రవేత్త `విటమిన్-సి`ని తొలిసారిగా ఉపయోగించారు. అప్పటి నుంచి `విటమిన్-సి`ని వ్యాధి నిరోధకత కోసం తరచుగా వాడుతున్నారు. ఎలాంటి వైరస్‌ల బారినా పడకుండా ఉండాలంటే ఒక వ్యక్తి రోజుకు 4-6 గ్రాముల `విటమిన్-సి`ని తీసుకోవాలి.
కోవిడ్-19.. విటమిన్-సి
కరోనా వైరస్ అనేది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుందనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే వ్యాధి నిరోధక శక్తి ప్రేరేపితమై వైరస్‌పై దాడి చేస్తుంది. ఈ క్రమంలో ఫ్రీ-రాడికల్స్, ఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి వైరస్‌ను చంపడంతో పాటు శరీర భాగాలకు కూడా హాని చేస్తున్నాయి. శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్ అయిన `విటమిన్-సి` ఈ సమయంలో రంగ ప్రవేశం చేసి ఫ్రీ-రాడికల్స్‌ను నిర్మూలించడంతోపాటు, ఆక్సిడెంట్లను న్యూట్రలైజ్ చేస్తుంది. `విటమిన్-సి`ని తరచుగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్లను పెంపొందించుకోవచ్చు. ప్లాస్మాలో కంటే తెల్ల రక్త కణాల్లో (ఇమ్యూన్ సెల్స్) `విటమిన్-సి` స్థాయిలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని బ్యాక్టీరియాను పారదోలే క్రమంలో ఆక్సీకరణకు గురయ్యే తెల్ల రక్త కణాలను `విటమిన్-సి` కాపాడుతుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మొదలైన వాటి వల్లన కలిగే రోగాలకు `విటమిన్-సి` అద్భుతమైన మందని ఇప్పటికే కొన్ని వందల పరిశోధనల్లో రుజువైంది. `విటమిన్-సి` సమృద్ధిగా ఉంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి వైరస్‌పై పోరు సులభమవుతుంది. అలాగే అంతర్గత ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది.
`విటమిన్-సి` ఎలా పెరుగుతుంది?
వైరస్‌ల నుంచి రక్షణ కోసం ఓ మనిషికి రోజుకు 4-6 గ్రాముల `విటమిన్-సి` అవసరం. సిట్రస్ ఫలాల నుంచి `విటమిన్-సి` సులభంగా లభిస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఒక గ్రాము `విటమిన్-సి` కావాలంటే 20 నారింజ పండ్లను తినాల్సి ఉంటుంది. అన్ని రకాల ఆకుపచ్చని కూరగాయలు, జామ, మామిడి, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, స్ట్రాబెరీ, క్యాప్సికమ్, ఇతర పుల్లని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే `విటమిన్-సి` సప్లిమెంట్‌లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కూరగాయలను వండే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా ఉడికించినా, వేయించినా `విటమిన్-సి` నశిస్తుంది.











