కుప్పం… చిత్తూరు జిల్లాలో మారుమూలన, అటవీ ప్రాంతంతో కప్పేయబడిన నియోజకవర్గం. అంతేనా… ఇటు ఏపీతో పాటుగా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఈ నియోజకవర్గం సరిహద్దు. ఈ కారణంగానే కుప్పంలోని చాలా ప్రాంతాల్లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలూ ఒకింత గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. ఈ మారుమూల నియోజకవర్గాన్ని అభివృద్ధిచేయాలన్న సంకల్పంతో ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకున్నారు. ఎప్పుడో 35 ఏళ్ల నాడు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబుకు.. ఆ తర్వాత ఇక తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
కుప్పం చంద్రబాబుకు బాగానే కలిసి వచ్చిందన్న వాదనా లేకపోలేదు. కుప్పం ఎమ్మెల్యేగానే చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఏకబిగిన 7 సార్లు కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ కాలంలోనే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు…ఈ దఫా మాత్రం కుప్పం రూపురేఖలను పూర్తిగా మార్చివేసే దిశగా కదులుతున్నారు. అందుకోసం ఆయన ఓ మాస్టర్ ప్లాన్ నూ రచించారు.
తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు సోమవారం వెళ్లిన చంద్రబాబు… మంగళ, బుధ వారాలూ అక్కడే ఉండనున్నారు. ఈ సందర్భంగా తాను రచించిన మాస్టర్ ప్లాన్ లో పలు కీలక అంశాలకు ఆయన బీజం వేయనున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సోలార్ పవర్ ను అందించే దిశగా ఓ బృహత్కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పాడి పరిశ్రమకు పెద్ద పీట వేయడంలో భాగంగా నియోజకవర్గంలో రెండు మిల్క్ డెయిరీలను ప్రారంభించే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఒక్క కుప్పం పరిధిలోని యువతలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగి అన్న మాటే వినిపించకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటన్నింటి కోసం కుప్పానికి ఏకంగా రూ.1,500 కోట్ల నిధులను కేటాయించే దిశగా చంద్రబాబు మాస్లర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు.
ఈ’ ఐదేళ్ల కాలం ముగిసిన తర్వాత కుప్పం సర్వతోముఖాభివృద్ధి చెందడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే… ఇప్పటికే కుప్పంలో విడతల వారీగా చంద్రబాబు పలు అభివృద్ధి పనులు చేశారు. నియోజకవర్గంలో ఇజ్రాయెల్ తరహా బిందు సేద్యానికి, సేంద్రీయ వ్యవసాయానికి చంద్రబాబు ఏళ్ల క్రితమే శ్రీకారం కుట్టారు. ఫలితంగా కుప్పం పరిధిలో పెద్ద ఎత్తున ఉద్యానవనాలు సాగవుతున్నాయి. కుప్పంలో పండుతున్న పూలు దేశంలోని చాలా ప్రాంతాలకు వెళుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా జాతీయ రహదారి తరహాలో వెడల్పాటి రహదారిని నిర్మించారు. ఫలితంగా కుప్పం ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.
ఇక కుప్పంలోనే ద్రవిడ వర్సిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పీఈఎస్ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటి వైద్యం కుప్పం ప్రజలకు అందేలా చేశారు. ఇప్పటిదాకా ఒక్కొక్కటిగానే అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు… ఇప్పుడు కుప్పం రూపు రేఖలను మార్చేసే ప్లాన్ ను బయటకు తీయడం కుప్పం ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తోంది.