వైఎస్ఆర్ సీపీకి చెందిన నేతలు కొంత మంది కూటమి పార్టీల్లో ముఖ్యంగా టీడీపీలో చేరుతున్నారని ఈ మధ్య వార్తలు అధికంగా వస్తున్న సంగతి తెలిసిందే. నిజంగానే దాదాపు 10 మంది వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరబోతున్నారని సొంత పార్టీనేతలే అంటున్నారు. ఇప్పటికే వారంతా కూటమి పార్టీల కీలక నేతలతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అయితే, వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తికనబరుస్తున్నప్పటికీ.. వారికి అంత తేలిగ్గా ఎంట్రీ లభించే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. పార్టీలో చేర్పించుకునే వైసీపీ నేతలను ఆచితూచి చేర్చుకోవాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారు. ఎవర్ని పడితే వారిని టీడీపీలో చేర్చుకుంటే.. పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని భావిస్తున్నారు. అందుకని వైసీపీ నుంచి టీడీపీలో చేర్పించుకునే నేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చంద్రబాబు నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.
వైసీపీ నుంచి వచ్చే ఇద్దరు ముగ్గురు నేతల కారణంగా పార్టీకి ప్రజల్లో ఉన్న మంచిపేరు దెబ్బ తినకూడదని చంద్రబాబు అన్నారు. అలాంటి వారు ఎవరైనా టచ్ లోకి వస్తే ముందుకు వెళ్లొచ్చని చంద్రబాబు సూచించారు. ఇలా చంద్రబాబు వైసీపీ నుంచి రావాలనుకుంటున్న వారి విషయంలో కొన్ని షరతులను నేతలకు వివరించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎవరు రావాలనుకుంటున్నా సరే.. అక్కడ వారు అనుభవిస్తున్న పార్టీ పదవులతో పాటు, ఇతర పదవులకు కూడా రాజీనామా చేసి రావాల్సిందే అని అన్నారు. అది కూడా వారి వ్యక్తిత్వం ఆధారంగానే టీడీపీలో చేర్పించుకోవాలని వెల్లడించారు. రాజకీయాల్లో ఎల్లప్పుడూ విలువలు ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అయితే, వైఎస్ఆర్ సీపీలో చాలా మంది నేతలు గతంలో తమ పరిధులకు మించి వ్యవహరించిన వారే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని సరైన విమర్శలు చేయొచ్చు కానీ.. శ్రుతి మించిన అసభ్య పదజాలంతో దూషించడం ఏ మాత్రం సరికాదు. జగన్ అండ చూసుకొని, ఆయన్ను మెప్పిస్తే పార్టీలో మంచి పదవులు దక్కుతాయనే ఉద్దేశంతో చాలా మంది వైసీపీ నేతలు అధికారంలో ఉండగా ఇలా వ్యవహరించారు. అంతేకాక, ప్రజల్ని కూడా ఎంతో వేధించిన వైసీపీ నేతలు ఉన్నారు. ఇలాంటి వారికి టీడీపీలోకి నో ఎంట్రీ అని చంద్రబాబు గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థులపై విషయపరంగా విమర్శలు చేసి, వ్యక్తిత్వం పోగొట్టుకోని వైసీపీ నేతలకు టీడీపీకి ఎంట్రీ ఉంటుందని తాజాగా చంద్రబాబు స్పష్టం చేశారు.