కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత సానుకూలమైన వార్త అందింది. రాష్ట్రంలో ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తికి అవసరమైన మొత్తం నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. పెండింగ్ లో ఉన్న పనులు సహా ప్రాజెక్టును సహా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే, కేంద్రం నుంచి ఈ తీపి కబురు అందడం వెనుక సీఎం చంద్రబాబు చేసిన బ్యాగ్రౌండ్ వర్క్ ఎంతో ఉందని అంటున్నారు. పోలవరం అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు విడతల వారీగా చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వారిని కలిశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
నవంబరు నుంచి కొత్త డయాఫ్రం వాల్ పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల్లో వేగం పెంచడం కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంతో సహకరించనున్నాయి. అమరావతి, పోలవరం రెండూ తనకు రెండు కళ్లు అని ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని సందర్శించి రివ్యూ కూడా చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణులను కూడా రప్పించి అధ్యయనం చేయించారు. ఈ విదేశీ నిపుణులు ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించి డిజైన్ లో మార్పులు, డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం విషయంలో కీలక సూచనలు చేశారు. దీంతో కొత్త ప్రాజెక్ట్ డిజైన్ కూడా చేపట్టారు.
ఈ డీపీఆర్ కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదముద్ర వేశాయి. చివరగా కేంద్ర కేబినెట్ నుంచి నిధుల కోసం ఆమోదం కూడా లభించింది. ఇదంతా కావడానికి చంద్రబాబుకు కేవలం మూడు నెలల సమయం మాత్రమే పట్టింది. దీంతో చంద్రబాబు పరిపాలన పటిమపై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఎలాంటి సమీక్షలు లేకుండా చేసి మొత్తం పోలవరం ప్రాజెక్టునే నాశనం చేసింది. అవగాహన లేని నీటిపారుదల మంత్రుల పుణ్యమా అని ప్రాజెక్టు పనులు ముందుకు జరక్కపోగా మూడేళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితి కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు వాయువేగంతో పోలవరం పనులను చక్కబెడుతుండడంతో వైసీపీ నేతలు సైతం అవాక్కవుతున్నారు