జిల్లాలో నేతల మధ్య గ్యాప్స్ ఈనాటివి కావు..!
చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా వర్సెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, గుంటూరు జిల్లా, గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, తూర్పు గోదావరి జిల్లా ఎంపీ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే అమాంచి, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఇంచార్జీ బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే అధికార వైసీపీ వర్గపోరు లిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చాంతాండంతా ఉంటుంది! గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ రెడ్డి సాక్షిగా నాయకులు మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
కడప జిల్లాలో జగన్ సాక్షిగా విభేదాలు ..!
కడప జిల్లాలో జగన్ సాక్షిగా బయటపడిన వర్గ విభేదాలను ఆయనే గమనించి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది! ప్రొద్దుటూరులో సీఎం బహిరంగ సభలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాయి. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి .. ఎమ్మెల్సీ రమేష్ ను మాట్లాడేందకు అవకాశం ఇవ్వలేదు. సభాధ్యక్షుడు స్థానంలో ఉన్న ఎమ్మెల్యే .. ఎంపీ అవినాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్ తదితర ముఖ్యులను మాట్లాడేందుకు ఆహ్వానించి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కు అవకాశం కల్పించలేదు. దీంతో దీనిని గమనించిన జగన్ జోక్యం చేసుకుని రమేశ్ ను మాట్లాడించమని రాచమల్లుకు సూచనల చేశారు. అప్పడు ఆ బీసీ ఎమ్మెల్సీ రమేశ్ కు మాట్లాడే అవకాశం కల్పించారు ఎమ్మెల్యే శివ ప్రసాదరెడ్డి. ఇలా ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో అధికార పార్టీ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.