నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈరోజు విడుదలైంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో నాని నటన, దర్శకుడి ప్రతిభ తదితర అంశాల గురించి తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
వాసు (నాని)కు దర్శకుడు కావాలనేది పెద్ద కోరిక. షార్ట్ ఫిలింస్ తీస్తూ కెరీర్ ప్రారంభిస్తాడు. ఓ షార్ట్ ఫిలింలో నటించేందుకు కీర్తి(కృతిశెట్టి)ని ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆమెతో వాసు ప్రేమలో పడతాడు. ఆ షార్ట్ ఫిలిం అందరికీ నచ్చుతుంది. దాంతో అతనికి దర్శకుడిగా సినిమా అవకాశం వస్తుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. దాంతో అతని దశ తిరుగుతుంది. ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తాడు. ఆ సినిమాను హిందీలో కూడా డైరెక్ట్ చేసి లీగల్ సమస్యలను ఎదుర్కొంటాడు. ఆ సమస్యలు ఎలాంటివి అన్నది తెర మీద చూడాల్సిందే.
ఇక్కడే శ్యామ్ సింగరాయ్ పాత్ర కూడా ఎంటరవుతుంది. వాసుకు, శ్యామ్ సింగ రాయ్ కూ ఉన్న సంబంధం ఏమిటన్నది మరో ఆసక్తికర అంశం. ఈ పాత్ర గురించి తెలియాలంటే 1960లోకి వెళ్లాల్సిందే. సినిమా ప్రథామార్థమంతా వాసు కథే నడుస్తుంది. ఇక ద్వీతీయార్థం వచ్చేసరికి శ్యామ్ సింగ రాయ్ రంగ ప్రవేశం చేస్తాడు. ఈ కథ బెంగాల్ లో ప్రారంభమవుతుంది. అక్కడి అరాచక శక్తులను అడ్డుకునే ప్రయత్నాన్ని శ్యామ్ సింగరాయ్ చేస్తాడు. ప్రజల కోసం పోరాడే మనిషి. దాని కోసం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. తన పోరాటంలో భాగంగా అతనికి దేవదాసి మైత్రేయి (సాయి పల్లవి) పరిచయమవుతుంది.
ఆమె గుళ్లల్లో నృత్యాలు చేస్తుంది. గుడి బయట ఆమెను కలుస్తాడు శ్యామ్. అలా రెండు మూడు సార్లు కలుస్తారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అక్కడి గొడవల కారణంగా మైత్రిన తీసుకుని కలకత్తాకు వచ్చేస్తాడు. ఆ తర్వాత విప్లవ రచయితగా మారతాడు. అతని తెగువను భరించలేని కొందరు వ్యక్తులు అతన్ని చంపేస్తారు. శ్యామ్ కథ తెలుసుకున్న వాసు కలకత్తా వెళతాడు. అక్కడ మైత్రి కోసం వెతుకుతాడు. అసలు శ్యామ్ కూ, వాసుకూ ఉన్న సంబంధం ఏమిటన్నది ఇందులోని మరో ఆసక్తికర అంశం.
ఎలా తీశారు? ఎలా చేశారు?
వాసుగా, శ్యామ్ సింగరాయ్ గా నాని తనదైన నాచురల్ ముద్రను పోగొట్టుకోకుండా చేశాడు. రెండు విభిన్న కోణాల్లో పాత్రలు ఉన్నా నాని మెప్పించాడు. అలాగే మైత్రి పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. నటిగా ఆమెకు ఇది కూడా మంచి చిత్రం అవుతుంది. ఉప్పెన తర్వాత కృతిశెట్టికి కూడా మంచి చిత్రమవుతుంది. ఆమె కళ్లలోని అమాయకత్వం మరోసారి మెప్పించింది. ఇక దర్శకుడి పనితనం విషయానికి వస్తే తాను ఏం చెప్పదలుచుకున్నాడో దానికి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. డొంక తిరుగుడు లేకుండా దర్శకుడు కథను చెప్పే విధానం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జనానికి హత్తుకుంటుంది.
అప్పట్లో దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపాడు. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల పరంగానూ, సాయి పల్లవి డ్యాన్సుల పరంగానూ ప్రత్యేకత కనిపిస్తుంది. సంభాషణలు ఆకట్టుకుంటాయి. కోర్టు డ్రామా సన్నివేశాలు సాగతీతలా ఉన్నాయి. అక్కడక్కడా కొన్నిలోపాలు ఉన్నా ఆకట్టుకునే కథనం ప్రేక్షకుడిని కథతో ట్రావెల్ చేసేలా చేస్తుంది. హీరోకీ, దర్శకుడికీ ఇది మంచి చిత్రం అవుతుందని చెప్పక తప్పదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట ప్రణవాలయకు సాయి పల్లవి అందిన నృత్యరీతులు ఆకట్టుకుంటాయి. సినిమాలో ఈ పాట హైలైట్ గా నిలుస్తుంది. షడ్రశోపేతమైన భోజనంలా ఈ సినిమా ఉంటుంది.
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృత శెట్టి, మడొన్నా సెబాస్టియన్, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమఠం తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సాను వర్గీస్, ఎడిటింగ్: నీవన్ నూలి, నిర్మాణం: నీహారిక ఎంటర్ టైన్ మెంట్.
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్
విడుదల తేదీ: 24-12-21
ఒక్క మాటలో: వినోదానికి ఏ రాయ్ అయినా ఒక్కటే
రేటింగ్: 3/5