నీటి పంపకాల విషయంలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరయ్యేందుకు అజెండాలతో సిద్ధం కావాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇప్పటికే లేఖలు రాశారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సిఎంలు ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారు. అయితే నదీ జలాల విషయంలో ఏపీ కావాలనే కయ్యానికి కాలు దువ్వుతుందని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనలు రాజకీయంగా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. తెలంగాణ నీటి పంపకం విషయంలో ఏపీ ప్రభుత్వం మరోసారి అడ్డు కట్టే పెట్టకుండా దానికి పూర్తి పరిష్కారమార్గాన్ని అన్వేషించి జగన్‌ను కట్టడి చేసే పనిలో సిఎం కెసిఆర్ సిద్ధమవుతున్నారు.
వ్యూహంతో అపెక్స్ భేటీకి..
ఈ నెల 6వ తేదీన జరగనున్న ఇరు రాష్ట్రాల జలవివాదాల సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ ముందు జగన్ ప్రభుత్వానికి ధీటుగా వాదనలు వినిపించే విషయంలో కెసిఆర్ సరికొత్త వ్యూహాలను అధికారులకు సూచించినట్లు సమాచారం.రాష్ట్ర నీటిపారుదలకు సంబంధించిన సమగ్ర వివరాలు, ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరీ, కేంద్రానికి నివేదించాల్సిన అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో అపెక్స్ కౌన్సిల్ భేటికి హాజరై తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు అధికారుకు దిశానిర్ధేశించినట్లు తెలిసింది. నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు బలంగా తిప్పికొట్టేలా సమాధానం చెప్పాలని సీఎం భావిస్తున్నారు.
జరుగుతున్న అన్యాయంపై..
కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భిన్న వాదనలు ఉన్నాయి. దీంతో తమకంటే తమకు నదీ జలాల విషయంలో అన్నాయం జరుగుతోందని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికి వ్యతిరేకంగా మరోకరు ప్రకటనలు చేసుకుంటున్నారు. అయితే కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాలతో ఇప్పటికే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రెండు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాయి. దీంతో కేంద్ర జల్‌శక్తి అధికారులు అపెక్స్ కౌన్సిల్ భేటీపై దృష్టిసారించారు. ఇప్పడు ఈ సమావేశం ఇరు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారనుంది. సిఎం కేసిఆర్, సిఎం జగన్‌ల మధ్య మైత్రి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అపెక్స్ సమావేశం వీరి స్నేహానికి ఎటువైపు దారితీస్తుందోనని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి అపెక్స్ సమావేశంలో ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటివాటా కేటాయింపులు జరగాల్సి ఉంటుంది. 2014 జూన్‌లో 2వ తేదీన తెలంగాణరాష్ట్రం ఏర్పిడిన తరువాత వెంటనే నీటి వాటా కేటాయింపులు జరపాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినా ఇప్పటి వరకు కేంద్రం జరపకుండా ఆలస్యం చేస్తుందని సిఎం కేసిఆర్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించేలా అపెక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఆ సమావేశంలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరీ











