అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోలను రద్దు చేయాలి..
ఏపీలో వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల తరుఫున ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు మొత్తం 71 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమీర్ శర్మకు అందజేశారు. పీఆర్సీని ప్రకటించడంతోపాటు అనే సమస్యలను ప్రస్తావిస్తూ.. జూయింట్ స్టాప్ కౌన్సిల్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆర్థిక మంత్రి బుగ్గన తో కలిసి చర్చలు జరిపిన జేఏసీ నేతలకు చివరాఖరికి నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి జగన్ తో చివరి భేటి అనంతరం పండుగ తరువాత పిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీపీఎస్ వంటి పలు అంశాలపై క్లారిటీ వస్తోందని భావించిన ఉద్యోగులకు తాజా ప్రభుత్వం జీవోలతో శృంగభగం తప్పలేదు. ఉద్యోగ వ్యతిరేఖ జీవోలను విడుదల చేసి, పెట్టుకున్న ఆశలను అడియాశాలు చేశారని మంగళవారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అవేదన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా ఇచ్చిన జోవోలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జేఏసీ నేతలు బండి, బొప్పరాజు తేల్చి చెప్పారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో చీకటి రోజు!
జగన్ రెడ్డి ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన జీవోలు సోమవారం అర్థరాత్రి ప్రభుత్వ వెబ్ సైట్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఉద్యోగ వ్యతిరేఖ జీవోలను ఇచ్చిన రోజును ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో చీకటి రోజుగా ప్రకటిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఎన్జీవో హోంలో జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘‘హెచ్ఆర్ఏ శ్లాబులు, సీసీఏ, పింఛనులపై చర్చే జరగలేదని, ఐఆర్ కంటే తక్కువ పీట్మెంట్ ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులకు ప్రకటించిన రాయితీలను ఎలా ఎత్తివేస్తారు?, ఇటువంటి ప్రభుత్వాన్ని తమ ఇన్నాళ్లు సర్వీసులో చూడలేని బండి శ్రీనివాస్ వాపోయ్యారు.’’ 11వ పీఆర్సీని అమలు చేస్తున్నప్పుడు కేంద్ర పీఆర్సీపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. తమకు రావాల్సిన డీఏలను అడ్డుపెట్టుకుని పీఆర్సీని ప్రకటిస్తారా? అని నిలదీశారు. తక్షణమే జీవోలన్నీ రద్దు చేయాలని, అలా కాకుంటే ఈ నెల 20 నుంచి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని బండి హెచ్చరించారు. జీవోలను వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టిపరిస్థితిలో అంగీకరించబోమని జేఏసీ నేత బొప్పరాజు చెప్పారు. పాత పద్దతిలో ఇచ్చే పీఆర్సీ కోసం అలుపెరగని పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ కోతలను వ్యతిరేకిస్తున్నామని, రేపు, ఎల్లుండు జరిగే సమావేశాలల్లో కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అవసరం అనుకుంటే సమ్మెకు కూడా వెనకాడమని ఇరు జేఏసీ నేతలు హెచ్చరించారు.











