తెలుగుదేశం పార్టీ కీలక నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రతా వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటివరకు పయ్యావులకు 1 ప్లస్ 1 భద్రతను ఇచ్చిన ప్రభుత్వం, తాజాగా ఆయన భద్రతను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆయనకు కేటాయించిన గన్ మెన్ లను వెనక్కి రావాలంటూ ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా తనకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల లేఖ రాయగా, ప్రభత్వం ఆయనకు ఉన్న భద్రతను సైతం తొలగించడం విమర్శలకు తావిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భద్రత విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది.పయ్యావుల భద్రతపై పోలీసు అధికారులు గంటకో రకంగా వ్యవహరిస్తున్నారు. ముందుగా పయ్యావుల భద్రత ఉపసంహరించి, ఆ తర్వాత కొనసాగిస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు.ఈ క్రమంలో తనను వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించారంటూ.. కొత్త గన్‌మెన్ పయ్యావులకు పరిచయం చేసుకున్నారు.
కొత్త పీఎస్‌వోను పరిచయం చేసిన వెంటనే విధుల్లో చేరాలని గన్‌మెన్ కు పయ్యావుల సూచించారు. పీఎస్‌వోలను మార్చడంపై పోలీస్ అధికారుల పొంతన లేని సమాధానాలిస్తున్నారు. ట్రైనింగ్ కోసమే గన్‌మెన్లను వెనక్కి రప్పించామని పోలీస్ అధికారులు చెబుతుండగా.. పీఎస్‌వోలు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఈ గందరగోళం మధ్య భద్రతా సిబ్బంది మార్పులపై సమాచారం ఇవ్వలేదని కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు.రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి.. గన్‌మెన్లను మార్చిన విషయం తెలియజేయాలని కేశవ్ అంటున్నారు.అదేసమయంలో ఉన్నఫలంగా కేశవ్ కు భద్రతా సిబ్బందిని మార్చడంపై పయ్యవుల కుటుంబీకులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పించారు.