కలియువ దైవం వేంకటేశ్వర స్వామి.. శ్రీ మహావిష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే హిందూ దేవుడు.భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా స్వామి వారు వేంకటేశ్వర నామంతో ప్రసిద్ధి గాంచారు.కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడికి సమానమైన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి.అలాంటి స్వామి అనేక ప్రాంతాల్లో స్వయంభువుగా ఆవిర్భవించారు.స్వామి వారికి సంబంధించిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో “మొదలకల్” ఒకటిగా కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో వెలసిన ఈ క్షేత్రం శ్రీ వేంకటేశ్వరుని ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతోంది.ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో దీనికి ఆదిశిల అనే పేరు వచ్చినట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి.ఇక ఇక్కడ స్వామి వారు అభయ హస్తం.. సుదర్శన చక్రం తోపాటు కత్తీ, డాలు పట్టుకుని దర్శనమిస్తారు. అందుకే భక్తులు ఇక్కడి స్వామి వారిని శత్రు సంహార వేంకటేశ్వరుడుగా కొలుస్తారు. ఈ స్వామిని పూజించడం వలన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వాస్తవానికి మొదలకల్ క్షేత్రం రెండవ తిరుపతిగా వెలుగొందుతొంది.ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా ‘ఆది’ అని, కల్లు అనగా ‘రాయి’ అని అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి ‘ఆదిశిల’ అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది.
పూర్వం గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజుకి ఈ ప్రదేశం తరచూ కలలో కనిపిస్తూ ఉండేదట. దాంతో రాజు ఈ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి, అక్కడ స్వయంభువుగా వున్న వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూశారని.. స్వామివారి ఆదేశాన్ని అర్ధం చేసుకున్న ఆ రాజు, అదే ప్రదేశంలో ఆయనకి ఆలయాన్ని నిర్మించారట. ఈ ప్రదేశాన్ని, ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని కనుక్కోవడంలో తనకి సహకరించిన పశువుల కాపరి అయిన బోయవాడిని ఆ రాజు స్వామి వారి ఆలయానికి అర్చకుడిగా కూడా నియమించారట.నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తున్నారట.
ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులో భక్తులు స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. దేవాలయంలోని భగవంతుణ్ణి మల్డకల్ తిమ్మప్ప దేవునిగా పిలుస్తుంటారు. ప్రతి ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి నాడు భక్తులు ఆనందోత్సాహాల మధ్య రథోత్సవం మరియు జాతర ( తిరునాళ్ల) జరుపుకుంటారు. కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏటా 20 లక్షల మంది పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా. ఏటా ఇక్కడ స్వామి వారికి జరిగే వాహన సేవల సందడిని, వైభవాన్ని చూసితీరవలసిందే.
ఇక ఈ గ్రామంలో ఎవరు కూడా వారి ఇళ్లకు రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది.ఇక్కడ నివసించే ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.