కరోనాతో ప్రపంచంలోని దాదాపు 215 దేశాలు విలవిలలాడుతున్నాయి. రోజుకు లక్షల కేసులు, వేల మరణాలు నమోదవుతునే ఉన్నాయి. అలాగే మనదేశంలో కూడా కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతోంది. ఇతర రాష్ట్రాలతోపాటూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రతి రోజూ 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. ప్రపంచంలో భారత్… కేసుల నమోదు విషయంలో మొదటి స్థానానికి చేరువలో ఉంది. 41 లక్షలు కేసుల నమోదుతో రెండవ స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భారత్ ఎప్పడో దాటేసింది. లాక్‌డౌన్‌ను ఎత్తేయడం, సడలింపులతో కూడిన అనుమతులివ్వడంతో భారత్‌లో కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతోందని నిపుణుల వాదన.
ఎంత స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కేసులు మరింతగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా కరాళ నృత్యాన్ని ఆపాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గంగా ఇప్పుడు కనబడుతోంది. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడానని ఎదురు చూస్తున్న కోవిడ్-19 టీకాను రష్యా ప్రభుత్వం ఆ దేశ ప్రజల కోసం మంగళవారం విడుదల చేసింది. మూడవ దశ పరీక్షలు పూర్తి కాకుండానే తమ దేశ సాధారణ పౌరుల కోసం స్ఫూత్నిక్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా టీకాను తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. ఇతర దేశాలు టీకాను కనుగొంటున్నాయి. ప్రజలకు అందుబాటులోకి కూడా తీసుకొస్తున్నాయి. కానీ మన దేశ టీకా ఎప్పడొస్తుందని భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో కరోనా కేసుల నమోదు విషయంలో భారత్ పరిస్థతి మరింత దారుణంగా ఉంటుందని వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సంక్షోభంతో పాటుగా,ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది. ఈ సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాలు పోటీపడి మరి కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇక భారతదేశం కూడా ఇతర దేశాలకు పోటీగా కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. దేశంలోని ఫార్మా దిగ్గజం, తెలంగాణా రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌లో నిమగ్నమైంది.
తుది దశకు చేరువలో….
భారత్ బయోటెక్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆసుపత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే . అందులో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి కూడా ఒకటి. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన భారత్ బయోటెక్ ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ప్రారంభించింది. మొదటిదశలో టీకా వేయించుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ సక్సెస్ అయినట్లుగా ప్రకటించిన భారత్ బయోటెక్, ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ను ప్రారంభించింది. కోవ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌కు 12 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మధ్య వయసు కలిగిన వాలెంటీర్‌లను సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. వారికి స్క్రీనింగ్ కూడా పూర్తయ్యింది . ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న మనదేశ ప్రజలతో పాటు ఇతర దేశాలు కూడా కోవ్యాక్సిన్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.











