నిజంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటేనే గులాబీ దళం వణికిపోతోందనే చెప్పాలి. అసలే అదికార పార్టీ. ఆపై క్రమంలో ప్రజల్లో వ్యరేతికత పెరుగుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి లాంటి దూకుడు కలిగిన నేత టీ పీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఇక బీజేపీ మంచి స్పీడుమీదున్నట్లే లెక్క. మరోవైపు పార్టీలతో సంబంధం లేకుండా హుజూరాబాద్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మంచి పట్టున్నట్లే లెక్క. మొత్తంగా ఈ అన్ని అంశాలను బేరీజు వేసుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకుండా తనదైన శైలి వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొన్నటిదాకా ఈటలకు దాదాపుగా కుడి భుజంగా వ్యవహరించిన బండా శ్రీనివాస్ కు కేసీఆర్ సర్కారు ఒక్కసారిగా ఊహించని పోస్టును కేటాయించింది. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండాను నియమిస్తూ కేసీఆర్ సర్కారు శుక్రవారం ఏకంగా ఉత్వర్వులే జారీ చేసింది.
బండా నేపథ్యం ఇదీ..
ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వాసి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన ప్రధాన అనుచరుడు. బండా శ్రీనివాస్ గతంలో విద్యార్ధి నాయకునిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హాకీ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ గానూ, జిల్లా టెలికాం బోర్డు మెంబర్ గానూ బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి రెండుసార్లు ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా… శ్రీనివాస్ 2001లోనే పార్టీలో చేరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పలు హోదాల్లో శ్రీనివాస్ పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమైనా,ప్రభుత్వ కార్యక్రమమైనా దాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. అంటే హాకీ ప్లేయర్ గా తనదైన గుర్తింపు కలిగిన బండా.. ఇప్పుడు ఈటల ఫోల్డ్ లో నుంచి కేసీఆర్ చేతిలోకి మారిపోయారన్న మాట.
హుజూరాబాద్ కు ఎన్నెన్ని తాయిలాలో..
కేసీఆర్ తో విబేధాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి దాదాపుగా బహిష్కరించేసినంత పనిచేశారు. అయితే పార్టీ నుంచి వెళ్లగొట్టేలోగానే అంట మేల్కొన్న ఈటల.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. హుజూరాబాద్ బైపోల్ లో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాదయాత్ర కూడా ప్రారంభించేశారు. మరోవైపు ఆయన సతీమణి కూడా ఓ రేంజిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వెరసి టీఆర్ఎస్ లో ఓ రకమైన భీకర భయాన్ని అయితే వారు కల్పించగలిగారు. ఈ భయం కారణంగా కొత్తగా ప్రారంభించనున్న దళిత బంధును కేసీఆర్ హుజూరాబాద్ నుంచే ప్రారంభించనున్నారు. ఇక హుజూరాబాద్ లోని మెజారిటీ ఓట్లు కలిగిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ కు ఏకంగా ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పదవినీ కట్టబెట్టారు. నోటిఫికేషన్ రాకుండానే హుజూరాబాద్ కు ఇన్నేసి తాయిలాలు ప్రకటిస్తే.. ఇక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే.. ఆ నియోజకవర్గానికి ఇంకెన్ని తాయిలాలు ప్రకటిస్తారోనన్న చర్చ ఊపందుకుంది. ఎన్నిక వేళ ప్రతీ నిర్ణయంలోనూ ఆ నియోజకవర్గానికి కేసీఆర్ పెద్ద పీట వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- ఈటల క్వశ్చన్..! దళిత సీఎం ఎటుపోయింది?