కరోనా సంక్షోభంతో కొత్త తెలుగు సినిమాలకు జనం దూరమయ్యారు. ఈ తరుణంలో నాచురల్ స్టార్ నాని నటించిన ‘వి’సినిమా ఓటీటీలో 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 4వ తేదీ రాత్రి 11 గంటలకే వి స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఓ పెద్ద హీరో సినిమా ఓటీటీ ద్వారా విడుదల కావడం ఇదే ప్రథమం. దాంతో అందరి కళ్లూ ఈ సినిమాపైనే ఉన్నాయి. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రథాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకుందా? ఇంతకీ వి సినిమాలో ఏముంది? తదితర విషయాలను చూద్దాం.
కథేంటి?: మతకలహాలను అరికట్టే విషయంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ హోదాలో ఉన్న ఆదిత్య (సుధీర్ బాబు) అందరి దృష్టిలో హీరో అయిపోతాడు. క్రైమ్ నవల రాసే ఉద్దేశంతో ఆదిత్యను కలిసిన అపూర్వ రామానుజన్ (నివేదా థామస్) అతనికి దగ్గరవుతుంది. అతడి నిజాయితీ, హీరోయిజం తోడవడంతో ఇద్దరి మధ్యా ప్రేమపుడుతుంది. ఈ తరుణంలో అతడి టీమ్ లో ఉండే పోలీస్ ఇన్ స్పెక్టర్ హత్యకు గురవుతాడు. ఈ హత్య చేసిన కిల్లర్ (నాని) డీసీపీ ఆదిత్యకు సవాలు విసురుతాడు. అతడిని పట్టుకునే విషయాన్ని ఆదిత్య ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు. కిల్లర్ వరుసగా హత్యలు చేస్తూ ఆదిత్యకు తను తర్వాత చేయబోయే హత్యల విషయంలోనూ క్లూ ఇస్తూ ఉంటాడు.
ఇలా కిల్లర్ వరుసగా ఐదు హత్యలు చేస్తాడు. అతను ఈ హత్యలు చేయటానికి అసలు కారణం అతని భార్య సాహెబ్ పంపిన ఓ వీడియో. అసలు ఈ కిల్లర్ ఎవరు? సాహెబా పంపిన వీడియోలో ఏముంది? ఐదుగురిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది? హీరో, విలన్ లలో చివరికి ఎవరు గెలుస్తారు? లాంటి విషయాలను సినిమా చూసి తెలుసుకుంటే మంచిది. సినిమాలో కిల్లర్ పేరును మధ్యలో విష్ణుగా రివీల్ చేస్తారు. ఇది పిల్లి, ఎలుకల చెలగాటం కాదు.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంలా కథ ఉంది.
ఎలా తీశారు? : కథ పాతదే… కేవలం ఇది ఓ రివెంజ్ డ్రామా. ఇలాంటి కథలు కోకొల్లలుగా వచ్చాయి. పోనీ కథనంలో కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సంభాషణలు పేలవంగా ఉన్నాయి. సన్నివేశాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రథమార్థమంతా స్లో నెరేషన్ లో సాగింది. సగం నుంచి కథనంలో వేగం పెరిగినా ఆకట్టుకోలేకపోయింది. కథ పాతచింతకాయ పచ్చడే అయినా దాన్ని రుచికరంగా అందించడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది. కథంతా కేవలం నాలుగు పాత్రల మధ్యే సాగుతుంది. పైగా అదితి రావు హైదరి పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. ఇందులోనే మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే.
నేపథ్య సంగీతం ఫరవాలేదనిపించింది. పైగా ఇందులో చెప్పుకోతగ్గ సస్పెన్స్ కూడా ఏమీ లేదు. తర్వాత ఏం జరుగబోతోందన్నది చూసేవారికి ముందే తెలిసిపోతుంటుంది. ఒకటి అరా డైలాగులు తప్పితే ఎక్కడా ఆ చమక్కులు అసలే లేవు. సంభాషణల రచనలోనూ శ్రద్ధ కొరవడినట్లు అనిపించింది. నాని, సుధీర్ బాబు తమదైన శైలితో నటనలో మెప్పించారు. నివేదా థామస్, అదితి పాత్రల్లోనూ అంత మెరుపు కనిపించలేదు. థాయిలాండ్ లో చిత్రీకరించిన పాట కేవలం మసాలా కోసమే అన్నట్టుంది. పాటలన్నీ పేలవంగానే ఉన్నాయి. చిత్రీకరణ బాగున్నా కథనంలో పాటలు ఇమడలేకపోయాయి. వి టైటిల్ జస్టిఫికేషన్ కూడా సరిగా లేదు.
ఇందులో నాని పాత్ర పేరు విష్ణు కాబట్టి వి అని పెట్టినట్టు ఉంది. వి అంటే మేమిద్దరం అనే అర్థంలోనూ తీసుకోవచ్చు. మర్డర్లు చేయడంలో హింసను ఎక్కువగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. ఈ సినిమాలోని ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? ఎవరు గెలిపించారు అనేది ఓ డైలాగులో పెట్టి ముగించేశారు. దర్శకుడు మోహనకృష్ణ నుంచి గ్రహణం, అష్టా చమ్మా, సమ్మోహనం లాంటి సినిమాని మనం ఆశించలేం. సినిమాలో ఏ మోషనూ లేదు ఎమోషన్ అంతకన్నా లేదు. అనేక చోట్ల సాగదీత ధోరణి కనిపించింది.
హైలైట్స్: నాని నాచురల్ గానే నటించాడు. విలన్ పాత్ర, చాలా బ్రూటల్ గా ఉంటుంది అని ప్రచారం చేసినట్లుగా అయితే ఈ పాత్ర లేదు. నిజానికి ఇది విలన్ పాత్ర అనటానికి కూడా వీలులేదు. సుధీర్ బాబు బాగా డ్యాన్స్ చేయగలడని ఓ పాటలో నిరూపించాడు. హావభావాలను పలికించడంలో అదితి శైలి ఇందులోనూ కనిపించింది. తమన్ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ, లొకేషన్లు ఆకట్టుకున్న అంశాలు. థియేటర్లలో రిలీజ్ కాకపోవడమే ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ సినిమా నుంచి ఎక్కువ ఆశిస్తే మాత్రం భంగపాటే మిగులుతుంది.
నటీనటులు: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి, నరేష్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, రజిత, రోహిణి, రాజా చంబోలు, ఆదర్శ్ తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం : అమిత్ త్రివేది, నేపథ్య సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ: వి.జి. విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్.
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: 05-09-2020
వేదిక: అమెజాన్ ప్రైమ్
ఒక్కమాటలో : కరోనా కలిసొచ్చింది… ఓటీటీ నడిచొచ్చింది.
రేటింగ్ : 2/5
-హేమసుందర్ పామర్తి