పోలీసులు కేసులు పెట్టించుకోవడంలో వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ నుంచి పార్టీ నేతలందరిది ఇదే వరుస. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం ఈ జాబితాలో చేరిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి రాజధాని మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైంది.
జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో అమరావతి ప్రాంత వాసులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. జర్నలిస్టు కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే జర్నలిస్టు కృష్ణంరాజుపైనా, డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొమ్మినేని శ్రీనివాసరావును, జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదల అయ్యారు.
అయితే జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలు మరోసారి భగ్గుమన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో సజ్జలపై తాజాగా కేసు నమోదైంది.
ఇక ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అంబటి రాంబాబుపైనా ఇటీవల రెండు కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సింగయ్య మృతి కేసులో A-2గా ఉన్నారు.