వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరెత్తితే చాలు ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జగన్‌పై షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ పర్యటనలకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అసలు ప్రజల సమీకరణలకు జగన్‌కు అనుమతి ఇస్తే..తామే కోర్టుకు వెళ్తామని కూడా హెచ్చరించారు.
పల్నాడు పర్యటనలో కారు కింద పడి సింగయ్య చనిపోతే జగన్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు షర్మిల. ఇలాంటి వారికి ప్రజల మధ్య తిరిగేందుకు పర్మిషన్ ఇస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు.
రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య ఘటనలో జగన్‌పై కేసు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు షర్మిల.
అయితే..ఆధారాలను పక్కాగా సేకరించి కేసులో జగన్‌కు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా జగన్ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు షర్మిల. చేసిన తప్పుడు పనికి.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం జగన్ పై ఉందన్నారు. క్షమాపణలు చెప్పకపోగా.. ఇది నకిలీ వీడియో AI ద్వారా రూపొందించారని చెప్పడం..దారుణమని విమర్శించారు.
జగన్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా సింగమయ్య కుటుంబానికి 5 కోట్లో, 10 కోట్లో పరిహారం ఇచ్చి క్షమించమని వేడుకోవాలన్నారు షర్మిల. ప్రజల ముందు కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లపాటు ప్రజలను, వారి సమస్యలను గాలికి వదిలేసిన పెద్దమనిషి..ఇప్పుడు ప్రజలను ఓదార్చేందుకు బయలు దేరారని ఎద్దేవా చేశారు.