ఎన్నికల్లో పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలకు సంబంధించిన ఈ జాబితాను ADR సంస్థ తాజాగా బయటపెట్టింది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన బీజేపీ 14 వందల 93 కోట్లు ఖర్చు చేయగా..కాంగ్రెస్ 620 కోట్లు ఖర్చు పెట్టింది.
ఐతే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల ఖర్చు వివరాలు కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నాయి. 2024 ఎన్నికలకు గాను టీడీపీ 34.25 కోట్లు ఖర్చు చేయగా, ఇదే సమయంలో వైసీపీ 325.67 కోట్లు వెచ్చించినట్టు నివేదిక వెల్లడించింది. అంటే వైసీపీ టీడీపీ పార్టీ కంటే 100 రేట్లు ఎక్కువగా ఎన్నికల కోసం ఖర్చు చేసింది. ఎన్నికల కోసం అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీల జాబితాలో వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. బీజేడీ, తృణమూల్, బీఆర్ఎస్ కూడా వైసీపీ కంటే తక్కువగానే ఖర్చు చేశారు.
వైసీపీ పెద్ద ఎత్తున ఖర్చు చేసినప్పటికీ…కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ 90 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. సాధరణంగా ఎన్నికలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఓటర్లు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన పార్టీల వైపే నిలబడతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఏపీలో ఈ విషయం కాస్త రివర్స్ అయింది. ఓటర్లు డబ్బు కు లొంగకుండా టీడీపీ కూటమి వైపు నిలబడ్డారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..కేవలం 5 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ ఎన్నికల ఖర్చు విషయంలో జాతీయ పార్టీలతో పోటీ పడడం, 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగు దేశం పార్టీ కంటే 10 రేట్లు ఎక్కువ ఖర్చు చేయడం చూస్తే గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ చేసిన మాయజాలం అర్థం చేసుకోవచ్చు.