తెలంగాణ రాష్ట్ర సమితికి గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయ్. పార్టీలో అసమ్మతి ఉందని తెలిసినా అది ఒక్కొక్కరి రూపంలో ఒక్కోసారి బయటపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయడు డీ.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిపైనా, ఆ పార్టీ సుప్రీమ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. అది కూడా బహిరంగంగా. ఓ తెలుగు చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీ.శ్రీనివాస్ తన అసంతృప్తిని, ఆవేశాన్ని వెళ్లగక్కారు.
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని అటు పార్టీలో కాని, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలలో కాని డీ.శ్రీనివాస్ జాడే లేకుండా పోయింది. ఇదే విషయాన్ని డీ.శ్రీనివాస్ కూడా మీడియా ముందు వాపోయారు.
“నేను కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాను. నన్ను రాజ్యసభ సభ్యుడ్ని చేశారు. అంతే ఆ తర్వాత మళ్లీ నా ముఖం చూడలేదు” అని డీ.శ్రీనివాస్ అన్నారు. అంతే కాదు తనకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని, ఆయనను కలిసేందుకు కనీసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
అంతా కుటుంబ పాలనే..
తెలంగాణలో ప్రజలు కోరుకున్న పాలన జరగడం లేదని, ఇక్కడంతా కుటుంబ పాలనే నడుస్తోందంటూ కూడా డీ.శ్రీనివాస్ మండిపడ్డారు. “తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కుటుంబ పాలన మాత్రమే ఉంది. ఇలాంటి తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమించలేదు “ అని డీ.శ్రీనివాస్ అన్నారు. కల్వకుంట్ల వారి పాలనలో ఉద్యమ ద్రోహులకు మేలు చేస్తున్నారని, ఎవరైతే తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కొట్లాడారో వారికి ఎలాంటి పదవులు రాలేదని ఆయన మండిపడ్డారు.
“ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వారిలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించింది. ఆ పార్టీ నుంచి వచ్చిన అనేక పదవులు అనుభవిస్తున్నారు. ఇదేనా తెలంగాణ సమాజానికి ఇచ్చే గౌరవం’’ అని డీ.శ్రీనివాస్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
ఏ పార్టీలో చేరతానో త్వరలో చెప్తా..
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డీ.శ్రీనివాస్ తాను పార్టీ మారతానని బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఏ పార్టీలోకి వెళ్తానో మాత్రం ఇప్పుడే చెప్పనని స్పష్టం చేశారు. ఆయన తనయుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతొంది. మరోవైపు డీ.శ్రీనివాస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి పైనా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన పార్టీ మారి తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పిన వెంటనే రాజ్యసభకు పంపించారని, ఇంతకంటే ఏ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ లో ఆయన తనయుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు తాను ఉన్న పార్టీ అభ్యర్థికి మద్దతు పలకకుండా ప్రతిపక్ష బీజేపీకి మద్దతు పలికారని ఆక్షేపిస్తున్నారు. డీ.శ్రీనివాస్ వృద్ధ నాయకుడు వెళ్లిపోతే పార్టీకి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.










