బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ రియాలిటీ కార్యక్రమం. భారత దేశం వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్వహించబడుతున్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ‘స్టార్ మా’ లో ప్రసారమవుతుంది. 2017, జూలై 16 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 24 తేదీనన ముగిసిన మొదటి సీజన్ ను జూనియర్ ఎన్.టి. ఆర్ నిర్వహించగా, 2018, జూన్ 10 తేదీన ప్రారంభమై సెప్టెంబరు 30 తేదీన ముగిసిన రెండవ సీజన్ ను నాని నిర్వహించాడు. 2019, జూలై 21న ప్రారంభమై 2019, నవంబరు 3న ముగిసిన మూడవ సీజన్ ను అక్కినేని నాగార్జున నిర్వహించాడు.
ప్రస్తుతం 2020, సెప్టెంబరు 6వ తేదీన ప్రారంభమైన నాలుగవ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్లో హీరో శివబాలాజీ, రెండొవ సీజన్లో తెలుగు ఆర్టిస్ట్ కౌశిల్, మూడో సీజన్లో సింగర్ రాహుల్ విజేతలుగా నిలిచారు. వివిధ ప్రముఖులు, ఇంటి సభ్యులు (పోటిదారులు)గా బిగ్ బాస్ నిర్మించిన ఇంట్లో కొద్ది రోజులు కలిసి ఉండాలి. ప్రతివారం, ఇంటి సభ్యులు తమ తోటి ఇంటి సభ్యులలో ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఎక్కువ నామినేషన్లు పొందిన ఇంటి సభ్యులు ప్రేక్షకుల ఓట్లను పొందుతారు. తక్కువ ఓట్లు వచ్చిన ఇంటి సభ్యులు ఇంటి నుండి వెళ్లిపోతారు. అలా ప్రతివారం ఒకరు వెళ్ళిపోతుంటారు. చివరికి మిగిలినవారు విజేతలవుతారు.
ముఖ్యంగా బిగ్ బాస్ అంటే సగటు ప్రేక్షకుడికి గుర్తుకు వచ్చేది బిగ్ బాస్ వాయిస్. బిగ్ బాస్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు.. బిగ్ బాస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఇంటి నిమయాలను మీరు పాటించని కారణంగా బిగ్ బాస్ మిమ్మల్ని శిక్షిస్తున్నారు.. అంటూ హౌజ్‌లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్‌కు మన ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయారు. ఈ రియాలిటీ షో ఇంత సక్సెస్ కావడానికి కారణం ఆ వాయిస్ కూడా. బిగ్ బాస్ అంటూ గంభీరమైన వాయిస్‌తో అందరినీ హడలెత్తిస్తుంటాడు అతడు.
మరి ఆయన ఎవరు.. అసలు బిగ్ బాస్ ఎలా ఉంటాడు.. బిగ్ బాస్‌లా మాట్లాడుతున్న వాయిస్ ఎవరిది..? ఆ స్వరం వెనక ఉన్న మనిషి ఎవరు..? మనకు తెలుసా.. అసలు ఆయనెక్కడ ఉంటాడు.. బిగ్ బాస్ ఆయన దగ్గరికి ఎలా వచ్చింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ టీవీలో వినే బిగ్ బాస్ వాయిస్ ఓవర్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా, చేయకూడదన్నా అన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన.
రాధాకృష్ణ వాయిస్ ఓవర్ ఈ షోకు బాగా హెల్ప్ అయింది. నిజానికి తెలుగులో బిగ్ బాస్ షో మొదలు పెట్టాలనుకున్నపుడు చాలా మంది వాయిస్ టెస్ట్ చేశారు. అయితే వాళ్లు అనుకున్నట్లుగా ఎవరి వాయిస్ కూడా దగ్గర్లో రాలేదు. అలాంటప్పుడు రాధాకృష్ణ వాయిస్ కూడా టెస్ట్ చేసారు. ఆ వాయిస్ ఈ షోకి సరిగ్గా సరిపోయింది. మొదటి సీజన్ నుంచి నాలుగో సీజన్ వరకు కూడా ఆయనే చెప్తూ వస్తున్నాడు. మూడో సీజన్ నుంచి తన గొంతను కాస్త మార్చి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు రాధాకృష్ణ. ఏదేమైనా మనిషి కనిపించకపోయినా కూడా తన గొంతుతోనే అందర్నీ మాయ చేస్తున్నాడు రాధాకృష్ణ.











