ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు ప్రభుత్వానికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు, పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్, అధికార పార్టీ మనిషినన్న అహంభావం … వెరసి రాష్ట్రంలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. నిజానికి ఈ దాడులకు అధికారంలో ఉన్న వారికీ సంబంధం లేదు. అయినా, దళితులపై దాడుల ప్రభావం మాత్రం ప్రభుత్వం మెడపై కత్తిలా మారుతోంది.
చీరాలలో దళిత యువకుడిపై పోలీసుల ఓవర్ యాక్షన్ తో ప్రారంభమైన ఈ దళిత దాడి అలా అలా కొనసాగుతూనే ఉంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళితునిపై జరిగిన దాడి ఢిల్లీ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ కేనులో బాధితుడు ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయడం, చర్యలు తీసుకోకపోతే నక్సలైట్లలో చేరుతానంటూ అల్టిమేటం ఇవ్వడం వరకూ వెళ్లింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి భవన్ దీనిపై తీసుకున్న చర్యలేమిటీ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం వరకూ వెళ్లింది.
ఈ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. “దళిత యువకుడిపై దాడి చేయడం ఏమిటీ. అది ఎవరైనా… ఎంత వారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు“ అని ప్రకటించారు. అంతే కాదు రాష్ట్ర హోం మంత్రి దళితులేనని, పోలీసు ఉన్నతాధికారుల్లో ఎక్కువ మంది దళితులేనని కూడా అన్నారు.
ఈలోగా చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కొత్త వివాదానికి కారణం అవుతోంది. తెలుగుదేశం పార్టీ దీనిని హత్యగా చిత్రీకరిస్తుండగా, వైసీపీ తమకు ఏమాత్రం సంబంధం లేదంటోంది. పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వితీసి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. దర్యాప్తులో ఏం తేలుతుందో తర్వాతి సంగతి.. ముందు జగన్ సర్కారు నిందలు పడాల్సి వస్తోంది.
విశాఖలో మళ్లీ కలకలం
ఒకవైపు దాడుల గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు విశాఖపట్నంలో రాజకీయ నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో మరో దళిత యువకుడికి శిరోముండనం చేశారు. ఇది పూర్తిగా ప్రయివేట్ వ్యవహారం. ఇంట్లో వస్తువులు పోయాయనే కారణంగా ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఎలాంటి ప్రమేయం లేదు. అయినా, ఇతర సంఘటనలను మేళవించి ప్రభుత్వం విరుచుకుపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
దళితుల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ నిందల నుంచి బయటపడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై జరిగిన తొలి సంఘటనకే తీవ్రంగా స్పందించి ఉంటే ఆ తర్వాత ఇన్ని సంఘటనలు జరిగి ఉండేవి కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైన తమ పైనే ఇన్ని దాడులు జరుగుతాయా అని దళిత వర్గాల నుంచి కొత్త కొత్త ఆలోచనలు వస్తే అప్పుడు ప్రభుత్వం డిఫెన్స్ లో పడక తప్పదంటున్నారు విశ్లేషకులు.
సెల్ ఫోన్‌లో చిత్రీకరించారంటే…
విశాఖపట్నంలో నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన శిరోముండనం సంఘటన విజువల్స్ చూసిన వారికి నిందితులు ఎంత పైశాచికంగా వ్యవహరించారో తెలుస్తుంది. ఒక మహిళ ఆ యువకుడిని గదిలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పుతూ కొడుతూంటే మరో మహిళ దాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తోంది.
ఈ దృశ్యాలన్నీ మేడ మీద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంటే ఆ యువకుడి పట్ల నూతన్ నాయుడి భార్య, బంధువులు, ఇంట్లో పని చేసే వారు ఎంత అమానుషంగా ప్రవర్తించారో అర్ధం అవుతోంది. ఈ సంఘటనను బయట చెబితే చంపేస్తామంటూ తనను బెదిరించారని యువకుడు పోలీసులతో వాఙ్మూలంలో పేర్కొన్నాడు. సంఘటన ఒకవేళ బయట పడినా తమకు ఏమీ కాదనే ధీమా నిందితుల్లో చాలా ఎక్కువగా కనిపించింది.
వ్యవస్ధ నుంచి ముఖ్యంగా పోలీసుల నుంచి ఏమీ కాదనే నమ్మకం ఇలాంటి సంఘటనలకు కారణంగా మారుతోంది. భవిష్యత్‌లో మరిన్ని సంఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనల నీడ తమ ప్రభుత్వంపై పడకుండా ఉండాలంటే అతి తక్కువ సమయంలో నిందితులకు కఠిన శిక్షలు పడాలి. అవి కూడా ఇక ముందు ఎవ్వరూ దళితుల వైపు కన్నెత్తి చూడలేనంతగా ఉంటేనే ప్రభుత్వం మెడపై ఉన్న ఈ దళిత కత్తి పక్కకు తప్పుకుంటుంది. మళ్లీ దళితులు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఎంత విశ్వసించారో ఇప్పడూ అంతే విశ్వసిస్తారు. లేకపోతే ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీస్తారు.











