ఆదిపురుష్ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అప్ డేట్ తెరముందుకు వస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తున్నారన్న ప్రకటన వెలువడగానే ఆయన అభిమానుల్లో ఒకింత నిరుత్సాహం కనిపించింది. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్ లో మొట్టమొదటి సారిగా ఓ డైరెక్ట్ హిందీ సినిమా సైన్ చేశాడు ప్రభాస్.
ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ కి చెందిన టీ సిరీస్ మూవీస్ బ్యానర్ వారు నిర్మించబోతున్న ఆదిపురుష్ అనే మైథలాజికల్ విజువల్ వండర్ లో ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగినప్పుడు సంబరాలు చేసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ లో చాలామంది ఇప్పుడు ఈ సినిమా పేరు ఎత్తితేనే చిరాకు పడుతున్నారు. దీనికి కారణం ఈ సినిమా కథాంశం అని తెలిసింది. ‘ఆదిపురుష్’ చిత్ర బృందం ఈ చిత్రాన్ని 7000 ఏళ్ల క్రిందట జరిగిన ఓ యధార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని ముందుగా చెప్పినప్పటికీ తాజాగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ రామాయణంలోని రాక్షస రాజు రావాణాసురుడిని పోలి ఉంటుందని ప్రకటించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో నిరుత్సాహం మొదలైపోయింది.
ఎంత బాగా తీసినా, ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా తీసేది రామయణ కథే కదా అనే పెదవి విరుపు మాటలు ఫ్యాన్స్ గ్రూపుల్లో వినిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా రామాయణాన్ని అప్పటి సాంకేతికను వాడుకొని తెరకెక్కించేశారని ఫ్యాన్స్ ఆదిపురుష్ టీమ్ కి గుర్తు చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ లో కొత్తగా ఏం చూపిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాను ఒకేసారి హిందీతో పాటు తెలుగులో కూడా బైలింగ్వల్ పద్ధతిలో తెరకెక్కిస్తున్నట్లుగా టీ సిరీస్ ప్రకటించింది.