విజయనగరం రాజకీయాల్లో శరవేగంతో దూసుకొచ్చి , సీనియర్లను పక్కనపెట్టి తన విధేయతతో ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి సొంతం చేసుకున్న కురుపాం ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆ పదవిని అలంకారప్రాయంగానే వాడుకుంటున్నారా? రాష్ట్ర రాజకీయాలలో అతిచిన్నవయసులో కేవలం రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పుష్పశ్రీవాణికి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిగా , ఉపముఖ్యమంత్రిగా తన తొలికేబినెట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.
వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఒకటైన విజయనగరం నుండి సీనియర్ అయిన చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణతో పాటు మరో సీనియర్, గిరిజన తెగకు చెందిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు వైఎస్ తొలి కేబినెట్లో అవకాశం వస్తుందని జిల్లా ప్రజలు భావించారు. అనూహ్యంగా పుష్పశ్రీవాణిని మంత్రిగా నియమించడంతో పాటు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా పట్టం కట్టడం రాజకీయ పరిశీలకులనూ ఆశ్చర్యపరచింది. విద్యాధికురాలు, చురుకైన వ్యక్తి, గిరిజన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం అవ్వడంతో రాష్ట్ర, జిల్లా గిరిజనులకు మేలు జరుగుతుందని అందరూ భావించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పలుమార్లు అసెంబ్లీలోను , బయట గిరిజన సమస్యలపై ఎలుగెత్తి చాటడంతో తన హయాంలో వాటన్నిటినీ పరిష్కరిస్తారని ఊహించారు.
అందుకు విరుద్ధంగా మంత్రి పుష్పశ్రీవాణి ప్రవర్తిస్తుండటం జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. ఆమె తన సొంత నియోజకవర్గం కురుపాంకే పరిమితమవుతుండటం మరింత కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రం సంగతి పక్కన పెడితే జిల్లాలోని సమస్యలపైనా ఆమె దృష్టి సారించడం లేదు. జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తూ ప్రజలను లెక్కకు మించి పొట్టన పెట్టుకుంటుంటే ఆమె నుండి స్పందన లేదు.
జిల్లా ఉన్నతాధికారులతో సరైన భేటీ నిర్వహించి కరోనా కట్టడికి ఆమె సరైన చర్యలు చేపట్టలేకపోయారు. వేరొకవైపు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ట్రైబల్ యూనివర్సిటీ పై దాగుడుమూతలు ఆడుతున్నప్పటికీ ఆమె పెదవి విప్పడంలేదు. చివరకు ఆమె సొంత నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణానికి చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కురుపాం నియోజకవర్గంలో సుమారు 30గ్రామాల ప్రజలకు అత్యవసరమైన ఈ వంతెన కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పలుమార్లు అసెంబ్లీలోను, జిల్లా పరిషత్ లోను ప్రశ్నించిన ఆమె ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. గిరిజన ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రహదారులతో అవస్థ పడుతూ, అత్యవసర పరిస్థితుల్లో డోలియే దిక్కు అవుతుండటంతో తమ శ్రమశక్తితో గిరిజనులు రహదారులు నిర్మించుకుంటున్నారు.
సోనూసూద్ స్పందించినా.. ఈమె స్పందించరా?
ఎక్కడో ఉన్న సినీనటుడు సోన్ సూద్ ఈ విషయం తెలుసుకొని స్పందించి, భవిష్యత్తులో గిరిజన ప్రాంత రహదారుల అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఈ విషయంలో స్పందించకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేరొకవైపు కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలోను , కాంట్రాక్ట్ పనులలోను తన కుటుంబీకుల జోక్యం అధికమవుతోందని , వారి కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుష్పశ్రీవాణి హయాంలో కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి అడుగంటిందని , అవినీతి పెచ్చరిల్లిందని స్వయానా ఆమె మామ , కురుపాం మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రాజు మీడియా సమావేశంలో ఢంకా భజాయించడం మరింత ఊతమిస్తోంది.











