క్యాస్టింగ్ కౌచ్, మీ టూ… పోయి ఇప్పుడు టూ మచ్ యుగం కూడా వచ్చేసినట్టే ఉంది. అబ్బాయిల్ని ముగ్గులోకి దింపేసి పబ్బం గడుపుకోవాలనుకునేవారు కొందరైతే, పరిచయాలు పెంచుకుని ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసి బెదిరింపులకు పాల్పడే బాపతు ఇంకొందరు. ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న వార్త ఏమిటంటే తనను 139 మంది గత ఎనిమిదేళ్లుగా 5000 సార్లుకు పైగా రేప్ చేశారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఫిర్యాదు చేసిన వాళ్లలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు, కొంత మంది జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నాయకుల పేర్లు కూడా ఉన్నాయి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతి ఈ విధంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ 139 మందిపైన నిర్భయతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవడంతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు, నటుడు కృష్నుడు తెరముందుకు వచ్చి తమ వివరణలు ఇచ్చారు. ఈ కేసులో ఎనిమిదేళ్లుగా రేప్ చేయడం అనే మాట అసంబద్ధంగానే ఉంది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం పోలీసుల ధర్మం కాబట్టి వారు ఆ పనిలోనే ఉన్నారు. కానీ ఈ ఆరోపణలు చాలామందిని మానసిక వేదనకు గురిచేశాయి.
ప్రదీప్ ఏమంటున్నారు?
తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించినవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రదీప్ బహిరంగంగా ప్రకటించారు. సున్నితమైన ఇలాంటి అంశంలో తన పేరు ఎందుకుందో కూడా ఆలోచించకుండా తనపై ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారని ప్రదీప్ ఆరోపించారు. తనపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేసేవారిపై చట్టపరమైన చర్యలకు కూడా ఆయన సిద్ధమయ్యారు. నటుడు కృష్ణుడు కూడా దీనిపై గళం విప్పారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, ఈ ఆరోపణలు తనను మానసిక వ్యధకు గురిచేశాయని ఆయన పేర్కొన్నారు. దీని వెనకాల ఎవరో ఉన్నారని, కావాలని ఆమెతో ఈ నాటకం ఆడిస్తున్నారని, వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు.
సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తున్నారా?
సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలను కూడా కొందరు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మొహం కనిపించగానే వారి ఫోన్ నంబర్లు తీసుకోవడం, అభిమానులమని చెబుతూ వారితో మాటలు కలపడం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త బలహీన మనస్తత్వం ఉన్నవారు ఇలాంటి వారికి దొరకిపోవడం కూడా అప్పుడప్పుడూ జరుగుతోంది. ఇప్పుడు ఈ యువతి కేసు దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఈ తరహా సంఘటనలు సినిమా రంగంలో జరుగుతున్నాయి.
శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత కొందరు జాగ్రత్త పడుతూ వచ్చారు. ముఖ్యంగా ఫోన్ రికార్డింగులు ఎక్కువగా జరుగుతున్నట్లు గమనించి కొందరు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే అలాంటి రికార్డింగులు ఉన్నవారు వారి బెదిరింపులకు లొంగిపోయి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నట్లు తెలుస్తోంది. కేసు పెట్టిన యువతి విషయానికి వస్తే ప్రదీప్, కృష్ణుడు లాంటి వాళ్ల పేర్లను కావాలనే ఇరికించారా? లేక వాళ్లకు ఈ అమ్మాయితో అంతకుముందు పరిచయముందా అన్నది తేలడం లేదు. ఇలాంటి సంఘటనలను చూసైనా మిగతావారు జాగ్రత్త పడితే మంచిదేమో.











