ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్న ఓ సంస్థ గురించి పక్క రాష్ట్రంలోనూ చర్చ జరిగింది. జగన్ అక్రమాలకు పాల్పడి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఆ కేసుల విషయంలో అంతగా పురోగతి సాధించడం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడి.. బ్రహ్మణి స్టీల్స్‌పై అమితమైన ప్రేమ కనబర్చి అతి తక్కువకే భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తాజాగా కర్ణాటక అసెంబ్లీలో తెరపైకి వచ్చింది.
కర్ణాటక శాసనసభ సమావేశాల్లో ఏపీకి చెందిన బ్రహ్మణి స్టీల్స్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని చర్చ జరిగింది. బళ్లారి నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మంగళవారం ఈ అంశంపై మాట్లాడారు. దాదాపు 12 ఏళ్ల కిందట బళ్లారి చుట్టుపక్కల రైతుల నుంచి దాదాపు 14 వేల ఎకరాల భూమిని ఈ బ్రహ్మణి సంస్థ స్వాధీనం చేసుకుందని ఆయన ఆరోపించారు. అయినా బ్రహ్మణి సంస్థ.. ఇప్పటిదాకా ఏ పనులూ మొదలుపెట్టలేదని, ఆ భూములు అంతే ఉన్నాయని వివరించారు. అప్పట్లో స్థానిక పొలిటికల్ లీడర్ల అండతో రైతుల నుంచి బలవంతంగా ఈ భూములు లాక్కున్నారని చెప్పారు. అలా లాక్కున్న భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా.. వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డగోలుగా వాడుకుంటున్నట్లుగా సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.
అప్పట్లో భూసేకరణ చట్టం అమలులో లేని సమయంలో బ్రహ్మణి స్టీల్స్ వల్ల భూములు కోల్పోయిన రైతుల జీవితాలు ఇప్పుడు దీనంగా ఉన్నాయని ఎమ్మెల్యే నారా భరత్ చెప్పారు. అప్పట్లో బ్రహ్మణి స్టీల్స్ లో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మించడంతో రైతులు ఆ భూములు ఇచ్చారని చెప్పారు. కనీసం ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ, కంపెనీ గానీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, కనీసం ఆ భూములనైనా తిరిగి ఇవ్వాలని వారు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.
పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలు తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు అంటున్నట్లుగా సభలో ప్రస్తావించారు. కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల్ని చెరిపివేయడం లాంటి అక్రమాల్లో కూడా బ్రహ్మణి స్టీల్స్ కంపెనీ పాత్ర ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష సభ్యుడు గాలి జనార్దనరెడ్డి స్పందిస్తూ.. ఈ ఆరోపణలన్నింటినీ సుప్రీంకోర్టు గతంలోనే కొట్టేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ ఆంధ్ర- కర్ణాటక రాష్ట్రాల సీఎస్‌లు, జిల్లాల కలెక్టర్ ల ఆధ్వర్యంలోనే గతంలోనే నిర్వహించారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఏకంగా ఇలా ఏపీ సీఎంతో సంబంధం ఉన్న కంపెనీ గురించి లేవనెత్తడం.. తీవ్రమైన ఆరోపణలు చేయడంపై రాష్ట్రంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.