టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్రంలోని బీసీ ప్రజలు అందరికోసం చేసిన ప్రకటన తాడేపల్లి ప్యాలెస్ లోని జగన్ ను భయపెడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర అనకాపల్లిలో జరుగుతుండగా.. బీసీ వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేశ్ ఈ ప్రకటన చేశారు. బీసీలకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని లోకేశ్ చెప్పారు. ఫోన్‌లో ఒక్క బటన్ నొక్కగానే ధ్రువీకరణ పత్రాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామని లోకేశ్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందించడంతో పాటుగా.. చంద్రన్న బీమాను రూ.5 లక్షలతో ప్రారంభించి రూ.10 లక్షలకు పెంచుతామని భరోసా ఇచ్చారు.
అంతేకాకుండా నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని కూడా వివరించారు. బీసీల కోసం టీడీపీ ఆదరణ పథకం తెస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. బీసీలకు తమ హయాంలో కల్పించిన రిజర్వేషన్లలో 10 శాతం జగన్ తగ్గించారని విమర్శించారు. ఆ మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులను కూడా జగన్ వేరే అవసరాలకు వాడారని లోకేశ్ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో 64 మంది బీసీలను వైసీపీ లీడర్లు చంపేశారని, దాదాపు 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే బీసీలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ హాయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788.38 కోట్లు ఖర్చు చేశామని.. జగన్ వచ్చాక ఏమీ చేయలేదని లోకేశ్ అన్నారు. వేట చేయకూడని కాలంలో ఇవ్వాల్సిన పరిహారం కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని చెప్పారు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను టీడీపీ సబ్సిడీపై అందించిందని.. వైసీపీ వచ్చాక మొత్తం క్యాన్సిల్ చేసిందని ఆరోపించారు. సముద్రంలో ప్రమాదవశాత్తూ చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు టీడీపీ రూ.5 లక్షలు ఇస్తే.. వైఎస్ఆర్ సీపీ దాన్ని కూడా రద్దు చేసిందని అన్నారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించే దిక్కు లేకుండా పోయిందని వాపోయారు. మత్స్యకారుల చేతుల్లో ఉన్న చెరువులను జీవో నంబరు 217తో తీసుకొచ్చి వైసీపీ నేతలు కొట్టేశారని విమర్శించారు.
లోకేశ్ ఇచ్చిన ఈ హామీలతో స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతలు భయపడుతున్నారు. బీసీల విషయంలో టీడీపీ అమలు చేసిన ఎన్నో పథకాలను సీఎంగా జగన్ అయిన తర్వాత రద్దు చేశారు. దీనిపై బీసీ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిపై అసహనంతోనే ఉన్నారు. తాజాగా నారా లోకేశ్ గతంలో తాము ఇచ్చిన ప్రయోజనాలు అన్నింటిని తిరిగి అమలు చేస్తామని చెప్పడంతో వారిలో ఆనందం నెలకొంది. దీంతో బీసీలు చేజారుతారేమో అనే ఆందోళన జగన్‌లో పట్టుకుంది.