అంతర్జాతీయ క్రికెట్ లో రాణించిన అంబటి రాయుడు తాజాగా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితమే రిటర్మైంట్ ప్రకటించి.. సీఎం జగన్ ని కలిశారు. వైఎస్ఆర్ సీపీలో ఏం నచ్చిందో కానీ, ఆ పార్టీ వైపు ఆకర్షితులై జగన్ ను అసందర్భంగా ఆకాశానికెత్తేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నుంచి ఏదో ఒక టికెట్ ఆశించి.. అంబటి రాయుడు వారితో సన్నిహితంగా మెలుగుతున్నారని ఆయన వ్యవహార శైలిని బట్టి అర్థం అవుతోంది. రాయుడు సొంత ప్రాంతం గుంటూరు కాగా.. అక్కడి నుంచే ఎమ్మె్ల్యే టికెట్ లేదా ఎంపీ టికెట్ తొలుత ఆశించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల రాజధాని ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీకి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని తెలుసుకున్న అంబటి రాయుడు తన స్థానాన్ని మార్చినట్లుగా తెలుస్తోంది. అందుకే మొన్నటిదాకా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఊళ్లు, స్కూళ్లు బాగా తిరిగిన ఆయన ఇప్పుడు విశాఖపట్నానికి రూట్ మార్చారు.
కొంత కాలంగా అంబటి రాయుడు విశాఖపట్నంలో కనిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రి గుడివాడ అమర్ నాథ్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆటలపోటీల కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అంబటి రాయుడు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనేది అద్భుతమైన కార్యక్రమం అని.. ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని జగన్ ను ఆకాశానికెత్తేశారు. సీఎం జగన్ క్రీడలను ప్రొత్సహించడానికి అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారని పొగిడారు. అయితే, అంబటి రాయుడు సడెన్ గా తన స్థానం మార్చడం వెనుక ఆయనకు సర్వేల భయం ఉందని అంటున్నారు.
తొలుత ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ను గుంటూరు నుంచి అంబటి రాయుడు ఆశించారు. కానీ, సర్వే రిపోర్టులు చూసి, తాను స్వయంగా జనాల్లో తిరగడం ద్వారా ప్రజల ఆదరణ చూసి అంబటి రాయుడుకు అసలు తత్వం బోధపడినట్లుగా తెలుస్తోంది. అసలే రాజధాని ప్రాంతం కావడం.. జగన్మోహన్ రెడ్డి మొండితనంతో దాన్ని విశాఖకు తరలించడంతో అక్కడ వారికి చెప్పలేనంత వ్యతిరేకత ఉంది. ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరు పోటీ చేసినప్పటికీ గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో విషయం గమనించిన అంబటి రాయుడు తాజాగా విశాఖకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడ రాజధాని ఏర్పాటు అంటూ, ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ అంటూ జగన్ ప్రజలకు ఆశ చూపిస్తున్నారు. దీంతో ఎంతో కొంత వైఎస్ఆర్ సీపీకి అనుకూల ఫలితాలు వస్తాయేమో అనే భ్రమలో అంబటి రాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇక్కడ పార్టీలో ఎన్నో ఏళ్లుగా నమ్మిన వారికి హ్యాండ్ ఇస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి.. అంబటి రాయుడు విషయంలో ఏం చేస్తారో వేచి చూడాలి. అసలే 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నో అనే ప్రచారం జరుగుతోంది. ఎంపీలైతే ఎక్కువ మంది పోటీ చేసేందుకే ఆసక్తి చూపడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ ఎంపీ స్థానం తనకు ఇస్తారేమో అనే ఆశతో అంబటి రాయుడు గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయినా ఆయనలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒకవేళ జగన్ అంబటి రాయుడికి విశాఖ లేదా చుట్టుపక్కల లోక్ సభ నియోజకవర్గాల్లో ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ వర్కౌట్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.