మెగాస్టార్ చిరంజీవికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఆచార్య షూటింగ్ కు సన్నాహాల్లో భాగంగా.. కొవిడ్ టెస్టు చేయించుకుంటే రిజల్ట్ పాజిటివ్ వచ్చినట్టు మెగాస్టార్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా .. గత అయిదురోజులుగా తనను కలిసిన వారందరూ కూడా దయచేసి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో గత అయిదురోజులుగా చిరంజీవిని ఎవరెవరు కలిశారన్నది పూర్తి వివరాలు ఎవ్వరికీ తెలియవు గానీ.. ఆయన కలిసిన ప్రముఖుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రితో చిరంజీవి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి, అభివృద్ధి గురించి చాలా చర్చించారు.
గత నెలలో తీవ్రమైన వర్షాలు హైదరాబాదు జనజీవితాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో కేసీఆర్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు పలువురుభారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. వారిలో చిరంజీవి, నాగార్జున రెండు రోజుల కిందట కేసీఆర్ ను కలిసి.. తాము ప్రకటించిన మొత్తాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారికి సినిమా పరిశ్రమకోసం 2000 ఎకరాలుకేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ హామీ ఇవ్వడం కూడా జరిగింది.
అయితే ఆ రోజు ఫోటోలు చూసిన వారికి మాత్రం.. ఆశ్చర్యం కలిగింది. చిరంజీవి మాస్క్ తీసి చేతిలో పట్టుకుని, నాగార్జున కూడా మాస్క్ లేకుండా, కేసీఆర్ కూడా మాస్క్ లేకుండా నడుచుకుంటూ వెళ్లడం లాంటి దృశ్యాలు పత్రికల్లో వచ్చాయి. వారితో పాటు ఉన్న తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా మాస్క్ లేకుండానే వారితో కలిసి తిరుగుతూన్న ఫోటోలు బయటకు వచ్చాయి.
అందరూ మాస్క్ ధరించడం గురించి.. పెద్ద పెద్ద సందేశాలు ఇస్తూ ఉండే ఈ సెలబ్రిటీ పెద్దలందరూ ఇలా మాస్క్ లేకుండా తిరగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు కూడా. ప్రత్యేకించి చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన కరోనా సీజన్ ప్రారంభమైన తొలినాటినుంచి కరోనా జాగ్రత్తల గురించి చేతులు కడుక్కోవడం గురించి, మాస్క్ ధరించడం గురించి పదేపదే వీడియోలు చేస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి జాగ్రత్తలు ప్రవచించే చిరంజీవి కూడా కేసీఆర్ లాంటి పెద్దలను కలిసినప్పుడు మాస్క్ లేకుండా ఉండడం.. చిత్రంగా ప్రజలు భావించారు.
రెండే రోజుల్లో చిరంజీవికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు గత అయిదురోజుల్లో ఆయనను కలిసిన వారి జాబితాలో ముఖ్యమంత్రి కేీసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, నటుడు బిగ్‌బాస్ ప్రయోక్త నాగార్జున .. తదితరులు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా తప్పనిసరిగా తక్షణం కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కొవిడ్ పరీక్షలు చేయిస్తారని అనుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా- చిరంజీవితో చాలా సుదీర్ఘంగా భేటీ అయిన కేసీఆర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్తారనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
హీరో నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షూటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకోరకంగా చూసినప్పుడు.. ఎంపీ సంతోష్ కుమార్ తప్ప.. వీరందరూ కూడా 60 ఏళ్ల వయసు దాటిన వాళ్లే. వీరందరూ కూడా కొవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉండే ఏజ్ గ్రూప్ కు చెందిన ప్రముఖులు. అందుకే .. నాగార్జునతో సహా అందరికీ కొవిడ్ టెస్టు అవసరం అని, చిరంజీవికి లాగానే అసింప్టమేటిక్‌గా ఉండే అవకాశం ఉన్నందున.. అందరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.