(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
టీడీపీ అధినాయకత్వం ముందు మరో పెద్ద సవాల్ నిలిచి వుంది. కేంద్ర, రాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను నియమించిన అధినాయకత్వం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల నియామకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పాత వారిని మార్చడం, కొత్త వారిని నియమించడం తదితర కసరత్తులు సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది.
తర్జనభర్జనలు
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుపై టీడీపీ అధిష్టానం విస్తృతంగా చర్చలు జరుపుతోందని విశ్వసనీయ సమాచారం. కొత్త ఇన్‌ఛార్జిల నియామకం, పాతవారిని కొనసాగించడం వంటి కీలక నిర్ణయాలపై తర్జన భర్జనలు పడుతోందని తెలుస్తోంది. ఒకవేళ కొత్తవారిని నియమిస్తే తలెత్తే పరిణామాలు, పాతవారిని యథావిధిగా కొనసాగించే నియోజకవర్గాల విరాలను సేకరించే పనిలో పార్టీ అధిష్టానం ఉందంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వినికిడి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో వాడీవేడిగా రాజకీయ చర్చలు మొదలయ్యాయి. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రధానంగా అందరి దృష్టి చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాలపైనే ఉంది.
చీపురుపల్లిలో..
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం చీపురుపల్లి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా కిమిడి నాగార్జున వ్యవహరిస్తున్నారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జిలుగా వ్యవహరించే వారినే రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థులుగా గుర్తిస్తుందని భావిస్తున్నారు. దీంతో వారి నియామకం రసవత్తరంగా మారింది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు కొనసాగిన నాగార్జున తాజాగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమితులు అయ్యారు. అందువల్ల ఆయన జోడు పదవుల్లో కొనసాగుతారా? లేక మరెవరికైనా ఈ పదవిని కట్టబెడతారా అనేది ప్రస్తుతం ఇక్కడ హాట్ టాపిక్.
కిమిడి కుటుంబానికే ..
చీపురుపల్లి నియోజకవర్గం నుండి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ఈ నియోజకవర్గం విషయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బొత్స వంటి నేతను ఢీ కొట్టాలంటే స్థానికంగా గట్టి పట్టున్న నేత అవసరం. గత ఎన్నికల్లో కిమిడి నాగార్జున బొత్సపై ఓటమి పాలైనా గట్టి పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బొత్సపై నాగార్జున తల్లి కిమిడి మృణాళిని విజయం సాధించి, మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో కిమిడి కుటుంబం నుంచే నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉంటారన్న చర్చ నడుస్తోంది. అదే తరుణంలో మరో సీనియర్ నేత కె.త్రిమూర్తుల రాజు కూడా ఈ పదవిపై ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.
నెల్లిమర్లలో ..
నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడుకు వయసు మీద పడుతుండటంతో ఇక్కడ కొత్త వారి నియామకం అనివార్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు పతివాడను కొనసాగించాలా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న మీమాంసలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పతివాడ కాకపోతే ఆయన కుమారుడు తమ్మినాయుడు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పేర్లు వినిపిస్తున్నాయి. పతివాడ కుమారుడు తమ్మినాయుడు పట్ల అధిష్టానం అంత సానుకూలంగా లేదని తెలుస్తోంది. దీంతో చంద్రశేఖర్ గానీ, బంగార్రాజుకి గానీ అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న బంగార్రాజు
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భూ సేకరణలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తనవంతు పూర్తి సహకారాన్ని అందించిన బంగార్రాజు కూడా గత ఎన్నికల నుంచే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల ఇన్‌ఛార్జి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
గజపతినగరంలో..
గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు కొనసాగుతున్నారు. ఆయన విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి కోసం ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీ అధిష్టానం అనూహ్యంగా కిమిడి నాగార్జునకు బాధ్యతలు కట్టబెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన నాయుడు తిరుగుబావుటా ఎగుర వేశారు. తన కార్యాలయానికి ఏకంగా పార్లమెంటరీ నియోజకవర్గ బోర్డు తగలించి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విషయమై ఆసక్తి నెలకొంది. అధిష్టానం అభిప్రాయాన్ని లెక్క చేయకుండా తిరుగుబావుటా ఎగురవేసిన కేఏ నాయుడిని పక్కనబెట్టి కొత్తవారిని నియమిస్తారా? ఆయన్నే కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరో సీనియర్ లీడర్ కరణం శివరామకృష్ణ కూడా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకొని ఇక్కడ నుండి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇన్‌ఛార్జిని మారిస్తే శివరామకృష్ణకే వస్తుందన్న ప్రచారం బాగా జరుగుతోంది.
విజయనగరంలో..
జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీతకు, 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారన్న విమర్శలు వచ్చాయి. అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకోవడంతో తీవ్ర విమర్శలు పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో అదితికి టికెట్ ఇస్తే గీతకు ఎలా సర్ది చెబుతారన్న విషయమై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుటుంబంతో మీసాల గీత దూరంగా ఉంటున్నారు. విజయనగరం మేయర్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నప్పటికీ ఆమె ససేమిరా అంటున్నట్లు వినికిడి.
మొత్తం మీద అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పు టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాల్ గానే మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. అగ్రనాయకత్వం ఈ వ్యవహారంలో ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.