ఆడపిల్లంటే మొదట్నుంచీ మనవాళ్లకు చులకనే. తొలికాన్పులో కొడుకే పుట్టాలని నోములు నోచేవారెందరో.. తన కొడుక్కు వారసుడే కావాలని కోరుకొనే తల్లిదండ్రులు లెక్కలేనంతమంది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావాలు చేయించే దుర్మార్గులు.. ఆడపిల్ల పుట్టిందని రోడ్డుపక్కన వదిలేసే దౌర్భాగ్యులు ఉన్న కాలం.. అందుకే ఈ దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి సమం కావడంలేదు.. ఇటువంటి కాలంలో ఆడపిల్లను కన్న భార్యని దేవతతో సమానంగా పూజించే భర్తల గురించి మీకు తెలుసా? మా ఇంటికి మహాలక్ష్మి నడిచి వచ్చిందని ఆ పసితల్లిని గుండెలకు హత్తుకుని మురిసిపోయే తండ్రుల గురింతి మీకు తెలుసా?
విరుష్క ఇంట మహాలక్ష్మి..
మా ఇంటికి మహాలక్ష్మి వచ్చేసింది. మేం ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఫీలవుతున్నామంటూ ట్విట్టర్‌లో ప్రకటించేశాడు విరాట్ కోహ్లీ. మాకు ఆడపిల్ల పుట్టిందనే విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు, ఆశీస్సులకు కృతజ్ఞతలు. అనుష్క, పసిబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మేం జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాం. ఈ సమయంలో మా ఏకాంతాన్ని మీరు గౌరవిస్తారని భావిస్తున్నా’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
రోహిత్‌శర్మ- రితికాల గారాలపట్టి సమైరా..
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ- రితికా సజ్దాల ముద్దుల కూతురు పేరు సమైరా. ఏమాత్రం ఖాళీ దొరికినా రోహిత్ సమైరాతో గడపడానికే అధిక ప్రాధాన్యం ఇస్తాడు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫొటోలు సమైరావే. టూర్లలో ఉన్నప్పుడు తనని మిస్ అవుతున్నానని ట్వీట్‌తుంటాడు రోహిత్.
మిస్టర్ వాల్ ముద్దుల తనయ అదితి..
మిస్టర్ వాల్ ఛతేశ్వర్ పుజారాకి మొదటి సంతానం అమ్మాయి అదితి. రెండేళ్ల వయసే అయినా తను అల్లరి పిడుగు. భార్య పూజాతో కలిసి ఆ చిన్నారి చేసే అల్లరి ఫొటోలు, వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటాడు పుజారా.
రహానేకు ఆర్యా అంటే ప్రాణమట…
టీమిండియాకు కష్ట సమయంలో కొండంత అండగా నిలుస్తున్న అజింక్యా రహానే 2014లో చిన్ననాటి స్నేహితురాలు రాధికను పెళ్లాడాడు. ఆ ఇద్దరి సంతానమే ఆర్యా రహానే. ఆర్యాకి దగ్గరుండి పాలు పట్టించడం, పాటలు పాడుతూ ఆడించడం.. ఇలాంటి వీడియోలెన్నో అప్‌లోడ్ చేస్తుంటాడు రహానే.
ఆద్యా, అకీరాల ముద్దుముద్దు మాటలు…
అతని ఆటతో ఎవరినైనా మంత్ర ముగ్దులను చేయగలిగే రవిచంద్రన్ అశ్విన్‌ది ప్రీతి నారాయణన్‌తో పెద్దలు కుదిర్చిన వివాహం. వీళ్లిద్దరికి చూడచక్కని కూతుళ్లు ఆద్యా, అకీరాలు. ముద్దుముద్దు మాటలతో ట్విట్టర్‌లో భలే సందడి చేస్తుంటారు. కొవిడ్ జాగ్రత్తల గురించి వాళ్లు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది.
జడ్డూ ఇంటికి రాకుమార్తె…
‘రవీంద్ర జడేజా.. సర్ దంపతుల తొలి గారాలపట్టి పాపనే. పేరు నిద్యానా. ‘మా ఇంటికి చిన్నారి రాకుమార్తె వచ్చింది. నా ఇంటిని వెలుగులమయం చేసింది.. అంటూ తను పుట్టినప్పుడు అందరితో సంతోషం పంచుకున్నాడు జడ్డూ.
జివా.. గురించి వేరే చెప్పాలా?
క్రికెట్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన మిస్టర్ కూల్ దోనీ.. ఎనర్జీ తన ముద్దుల కూతురికి సైతం వచ్చిసినట్టుంది. ఎం.ఎస్.ధోనీ-సాక్షిల కూతురు జివా ఎంత పాపులరో వేరే చెప్పనక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే జివా అంటే ఆ దంపతులకే కాదు.. దేశంలోని మరెందరికో అమితమైన ఇష్టం.
ఆ ఇళ్లలోనూ మహాలక్ష్మీలే!
ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఈమధ్యే తండ్రయ్యాడు. వెల్‌కం టూ ది వరల్డ్ లిటిల్ ప్రిన్సెస్’ అంటూ జనవరి 1, 2021న తన చిన్నారికి స్వాగతం పలికాడు యాదవ్. సురేశ్ రైనా- ప్రియాంకా చౌధురీల ఇంటిదీపం గ్రేసీ రైనా. రైనాకి కూతురిపై ఎంత ప్రేమంటే తన పేరు చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. హర్భజన్‌సింగ్- గీతా బస్రాల కూతురు హినాయా సింగ్. హినాయా అంటే మెరుపు అని అర్థం.
ఇంటికి అందం ఇల్లాలే… అమ్మకు మించిన ప్రేమే లేదు. వంటి మాటలెన్నో చెప్పుకుంటాం. కానీ.. మన ఇంట్లో మాత్రం ఆడపిల్ల పుట్టకూడదని వేడుకుంటాం. ఇదేం విడ్డూరమో కదా? ఇకనైనా ఆలోచనను మార్చుకుందాం.. మన క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకుంటూ.. బంగారు తల్లులే రావాలని కోరుకుందాం. పుడమిని మరింత అందంగా తీర్చిదిద్దుదాం!











