రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా తమిళంలో హిట్ అయిన ‘తడమ్’ ఆధారంగా తెరకెక్కింది. ఎనిమిది నెలల క్రితమే విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యమై ఎట్టకేలకు విడుదలైంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన రామ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది క్రైమ్ థ్రిల్లర్ కథ. ఆ ఛాయలు లేకుండా లవ్ ట్రాక్ తో దాదాపు అరగంటకు పైగా స్లో నెరేషన్ తోనే సాగింది. ముఖ్యంగా సిద్ధార్థ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరిద్దరూ కవల సోదరులు. ఓ హత్యతో ఈ ఇద్దరికీ సంబంధం ఉంటుంది. హత్య ఎవరు చేశారన్నదానిమీదే ద్వితీయార్థం అంతా సాగుతుంది.
అసలు హత్యకు కారణం ఏమిటి? ఎవరు ఈ హత్య చేశారు? ఎందుకు చేశారు? అనేది తేలితే ఈ కథకు ఉన్న చిక్కుముడి విడిపోతుంది. కవల సోదరులుగా రామ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ ఇద్దరికీ ఒకరిపై ఇంకొకరికి ఎందుకు కోపం అన్నది కూడా చివరి వరకూ చూస్తేనే కానీ అర్థం కాదు. ప్రథమార్థం సిద్ధార్థకు మాళవికాశర్మతో ఉన్న ప్రేమాయణంతోనే కొంత సాగుతుంది. ఆ తర్వాత ఆ పాత్ర మనకు కనిపించదు. ఆకాష్ అనే వ్యక్తి హత్యతో కథపై ఆసక్తి రేకెత్తుతుంది.
ఎలా చేశారు? ఎలా తీశారు?
క్రైమ్ థ్రిల్లర్ కథల్ని మనం చాలా చూశాం. ఇలాంటి కథల్లో సాగదీత అసలు పనికి రాదు. సినిమా ప్రథమార్థం అంతా సాగదీతే కనిపిస్తుంది. కొన్ని పాత్రల ప్రయోజనం ఏమిటో అర్థం కాదు. తమిళంలో హిట్ అయిన కథను తెలుగులో అంత ఆసక్తికరంగా మలచకపోవడం దర్శకుడి ఫెయిల్యూర్ అని కూడా చెప్పలేం. ప్రధానంగా స్క్రీన్ ప్లే లోపమే కనిపిస్తుంది. పాత్రలు అలా ఎందుకు మారాయో చూపడానికి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అ సన్నివేశాలు కూడా బోర్ కొట్టిస్తాయి.
సినిమా ప్రారంభమైన గంటసేపటి వరకూ బోరింగ్ గానే కనిపిస్తుంది. ఆకాష్ హత్యతో ఆసక్తి ఏర్పడినా అక్రడ కూడా కథని గ్రిప్పింగ్ దర్శకుడు చెప్పలేకపోయారు. ముక్కూ మొహం తెలియని వారికి మరో హీరోయిన్ అమృతా అయ్యర్ లక్ష రూపాయలు ఇవ్వడం నాటకీయంగా అనిపిస్తుంది. ఇలా పొంతనే లేని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది అనేలా సినిమా తయారైంది. పాటల్లోనూ ప్రత్యేకత లేదు. మణిశర్మ రీరికార్డింగ్ కూడా మెప్పించలేకపోయింది.
హెబ్బా పటేల్ ఐటెం సాంగ్ కొంత ఊరటనిచ్చినా ఇది కొంత అసందర్భంగానే ఉంటుంది. మరీ ఎరుపు ఎక్కువైతే ఏం జరుగుతుందో ఈ సినిమానే ఓ ఉదాహరణగా చెప్పాలి. సాఫీగా సాగిపోయే కథ అనేక సార్లు పట్టాలు తప్పుతూ మళ్లీ పట్టాలు ఎక్కుతూ నడిచింది. హీరో గా రామ్ పెర్ ఫార్మెన్స్ బాగుంది. నివేదా పేతురాజ్ పాత్ర ప్రయోజనం కూడా మనకు అర్థం కాదు. ఆ పాత్రను వేరే వారితో చేయించినా సరిపోయేది. పోనీ హీరో మీద సానుభూతి ఏర్పడి అతనికి దగ్గరవుతుందా అంటే అదీ లేదు. పవిత్ర లోకేష్ పాత్ర కూడా అలాంటిదే. ఆమెకో పాత్ర ఇవ్వాలి కాబట్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే ఉంటాయి.
హైలైట్స్: రామ్ నటన, ఆకాష్ మర్డర్, కెమెరా పనితనం బాగుంది.
నటీనటులు: రామ్ పోతినేని, మాళవికా శర్మ, నివేథా పేతురాజ్, అమృత అయ్యర్, సత్య, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ , పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
కెమెరా: సమీర్ రెడ్డి
నిర్మాత: స్రవంతి రవికిషోర్
మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కిశోర్ తిరుమల
ఒక్కమాటలో: డేంజర్ సిగ్నల్
రేటింగ్: 2/5
– హేమసుందర్ పామర్తి











