తెలుగులో సంగీత దర్శకులుగా రాజ్ – కోటి ఒక రాకెట్ లా దూసుకొచ్చారు. అప్పటివరకూ తెలుగు తెరపై షికారు చేస్తున్న పాటలకు కొత్త రూపు .. ఊపు తీసుకొచ్చారు. జోరుగా హుషారుగా సాగే పాటలకు రాజ్ – కోటి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఒక వైపున ఇళయరాజా .. మరో వైపున చక్రవర్తి తమ హవా కొనసాగిస్తుండగా రాజ్ – కోటి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి సమయంలో తమదైన మార్కు చూపించి అప్పటి దర్శక నిర్మాతలను .. హీరోలను, ఆ తరువాత ప్రేక్షకులను ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. అంతటి పోటీని తట్టుకుని వాళ్లు నిలిచారు .. గెలిచారు.
అలా ఎన్నో సంవత్సరాల పాటు రాజ్ – కోటి తమ బాణీలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. చాలా సినిమాలు విజయాలను సాధించడంలో సంగీతం పరంగా ప్రధానమైన పాత్రను పోషించారు. వాళ్లు స్వరపరిచిన ఎన్నో బాణీలు సూపర్ హిట్ సాంగ్స్ జాబితాలో కనిపిస్తాయి. ఇప్పటికీ అవి జనం నాలుకలపై నాట్యం చేస్తూనే ఉంటాయి. సంగీత దర్శకులుగా వాళ్ల ప్రయాణం ఒక ప్రవాహంలా సాగింది. అలాంటి రాజ్ – కోటి ఆ తరువాత కాలంలో విడిపోయారు. ఆ విషయాన్ని గురించి కోటి సోదరుడు సాలూరి వాసూరావు తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
రాజ్ – కోటి కెరియర్ ఆరంభంలో చాలా కష్టపడ్డారు. చిరంజీవి ‘యముడికి మొగుడు’ సినిమా వాళ్లకి బ్రేక్ ఇచ్చింది. మొదటి నుంచి కూడా కోటి హార్డ్ వర్కర్. ఒక ట్యూన్ తాను అనుకున్నట్టుగా వచ్చేవరకూ నిద్రకూడా పోయేవాడు కాదు. ట్యూన్ తనకి నచ్చేవరకూ ప్రయత్నాలు ఆపేవాడు కాదు. ఒక పాటను నలుగురైదుగురు రైటర్స్ తో రాయించేవాడు. తమకి అప్పగించిన పని వెంటనే చేసేద్దామని కోటి అంటే, కాస్త కూల్ గానే చేద్దామని రాజ్ అనేవాడట. లేట్ చేస్తే వర్క్ వేరే వాళ్లకి వెళ్లిపోతుందని కోటి టెన్షన్ పడేవాడు. అలా వర్క్ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంతే .. మరో కారణం లేనే లేదు” అని చెప్పకొచ్చారు.