ఏపీలో ఇసుక ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆన్ లైన్ లో టన్ను ఇసుక రూ.374కు దొరుకుతున్నా… అక్కడి నుంచి రీచ్ కు, మరలా అక్కడ నుంచి వినియోగదారుడిని చేరేసరికి టన్ను ఇసుక రూ.3600కు చేరుతోంది. ఇసుక కొనుగోలు కంటే రవాణా ఛార్జీలు భారం మోయలేక చాలా మంది నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
చుట్టూ తిరిగి…కొనుగోలుదారునికి చేరి…
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వెంకటరెడ్డి ఆన్ లైన్ లో 18 టన్నుల ఇసుక బుక్ చేసుకున్నారు. మామూలుగా అయితే తాడేపల్లికి సమీపంలోకి రొయ్యూరులోనే ఇసుక రీచ్ ఉంది. కానీ అక్కడ నుంచి నేరుగా వినియోగదారుడి ఇసుక చేరదు. రొయ్యూరు, అమరావతి రీచ్ ల నుంచి ఇసుకను తాడేపల్లి మీదుగా పెదకాకానిలో ఏర్పాటు చేసిన డంపింగ్ పాయింట్ కు తరలిస్తారు. తాడేపల్లిలో బుక్ చేసుకున్న వెంకటరెడ్డి ఇంటి ముందుగానే డంపింగ్ పాయింట్ కు ఇసుక వెళుతుంది. కానీ వినియోగదారుడికి మాత్రం నేరుగా ఇవ్వరు. మరలా ఆ ఇసుకను మరో వాహనంలో ఎత్తి పెదకాకాని నుంచి తాడేపల్లి వెనక్కు తీసుకు వచ్చి వెంకటరెడ్డి ఇంటికి చేరుస్తారు. రాను పోను రవాణా ఛార్జీలు 18 టన్నులకు రూ.29,000 వసూలు చేశారు. అంటే 18 టన్నుల ఇసుక కొంటే రూ.7000 అయితే రవాణా ఛార్జీలు రూ.29 వేలు అయ్యాయని రైతు వాపోయారు. ఇది కేవలం వెంకటరెడ్డి ఉదంతమే కాదు. చాలా మంది వినియోగదారుల పరిస్థితి ఇలాగే తయారైంది.
రవాణా గారడీ… కస్టమర్ల దోపిడీ
ఇసుక రవాణా కాంట్రాక్టులు పొందిన వైసీపీ నేతలు రవాణా ఛార్జీల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇసుక అక్రమాలు అరికట్టాలని ప్రయత్నిస్తున్నా, కింద స్థాయిలో వైసీపీ నేతలు మాత్రం దొపిడీకి తెరలేపారు. ఇసుక సరఫరా ముసుగులో ఎక్కువ రవాణా ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఏటా రూ.1800 కోట్ల ఆదాయం వస్తోంది. రవాణా కాంట్రాక్టర్లు మాత్రం ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రూ.8000 కోట్లు వసూలు చేస్తున్నారు.
సరఫరాలో సరిపడని లోపాలు…
ఇసుక సరఫరాలో అనేక లోపాలు సీఎంను అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. టీడీపీలో ఇసుక అక్రమాలు ఎక్కువగా జరిగాయని వైసీపీలో అలా జరగడానికి వీల్లేదని సీఎం కఠినంగా చెప్పారు. అయితే అధికారులకు మాత్రం అవేమీ పట్టినట్టు కనిపించడం లేదు. కొందరు వినియోగదారులు ఇసుక బుక్ చేసుకుంటే అర్ధరాత్రి లారీలో ఇసుక తెచ్చి పోస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన ఇసుక అందించాలని ప్రయత్నిస్తుంటే, అక్రమార్కులు మాత్రం తమ జేబులు నింపుకోవడంపైనే దృష్టి సారిస్తున్నారు.
రీచ్ నుంచి నేరుగా అందాలి…
అక్రమాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ కేంద్రాలే అక్రమాలకు నిలయాలుగా మారాయి. ఇసుకలో జరగుతున్న అక్రమాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లడం లేదని అందుకే అక్రమార్కులు ఇలా తెగబడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా ఇసుకను నేరుగా రీచ్ నుంచి వినియోగదారుడికి అందించాలని భవన నిర్మాణదారులు కోరుతున్నారు.