దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల రేటు కూడా పైపైకి వెళ్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రావడానికి 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. శాంపిల్స్ సేకరణ కూడా కష్టంతో కూడుకున్న పని. అదే.. డ్రైస్వాబ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తే 3 గంటల్లో ఫలితం ఇవ్వవచ్చు. ప్రభుత్వాలు కోరితే డ్రైస్వాబ్ పరీక్షలకు సంబంధించిన టెక్నాలజీని అందించేందుకు హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ) రెడీగా ఉంది.
వైరస్ ముప్పు ఉండదు
బాధితులు ఆర్టీపీసీఆర్ పరీక్షకు వచ్చినప్పటి నుంచి ఫలితం తేలేదాకా గంటలకొద్దీ ఎదురుచూపులు తప్పడం లేదు. ఎక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా బాగా వేస్ట్ అవుతోంది. టెస్టు కోసం వేచి చూసే లోపల వైరస్ ఇతరలకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే నమూనా తరలింపులో చాలామంది వైద్య సిబ్బంది వైర్ బారిన పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో భాగంగా బాధితుల నుంచి సేకరించిన గొంతు, ముక్కు స్రావాల నమూనాలను సేకరిస్తారు. వీటిని ల్యాబ్ కు తరలించే సమయంలో వైద్య సిబ్బందీ వైరస్‌కు గురవుతున్నట్లు సైంటిస్టులు ఇప్పటికే గుర్తించారు. ‘డ్రై స్వాబ్’ పరీక్ష విధానంతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

రూ. 499కే పరీక్ష
కరోనా టెస్టులకుగాను ప్రైవేట్, కార్పరేట్ ఆస్పత్రులు 500 నుంచి 2000 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అదే ఈ డ్రైస్వాబ్ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు. చాలా ఈజీగా, వేగంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా బాధితులు ఫలితాలను కూడా వేగంగా తెలుసుకోవచ్చు. కేవలం మూడు గంటల్లో రిజల్ట్ తెలుసుకోవచ్చు.

ఇప్పటికే హైదరాబాద్ లో…
డ్రైస్వాబ్ పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సీసీఎంబీ ప్రకటించింది. ఇప్పటికే కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు డ్రైస్వాబ్ పరీక్షలు చేస్తున్నాయి. కొద్దిగంటల్లోనే ఆర్‌టీపీసీఆర్ టెస్టు చేసి కరోనా నిర్ధారణ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ డ్రైస్వాబ్ టెస్టు చేయించుకోండి మరి.










