విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి అవాంతరాలు తప్పడంలేదు. అనేక ఇబ్బందులను అధిగమించి ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయాల్సిన దుర్గగుడి పై వంతెనను ఎట్టకేలకు ఆపసోపాలుపడి ఐదేళ్లకు పూర్తి చేశారు. ఈ నెల 18న కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి గడ్కరీ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించాల్సి ఉంది.
అంతలోనే కరోనా రూపంలో ఉపద్రవం వచ్చిపడింది. కేంద్ర మంత్రి గడ్కరీకి కోవిడ్ సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దీంతో దుర్గగుడి పైవంతెన ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈ నెల మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన పైవంతెన, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఆగిపోయింది. తాజాగా కేంద్ర మంత్రికి కరోనా రావడంతో మరోసారి వాయిదాపడింది.
ఆయన రాకపోతే ఇక అంతే సంగతులా?
అసలే కరోనా కాలం. కేంద్ర మంత్రుల నుంచి సామాన్యుల దాకా కోవిడ్ ఎవరినీ వదలడం లేదు. దుర్గగుడి వద్ద ప్రతిష్టాత్మకంగా పైవంతెన నిర్మించారు. అందులో కేంద్ర మంత్రి గడ్కరీ బాగానే సహకరించారు. కాబట్టి ఆయన్ని ప్రారంభోత్సవానికి పిలవాలనుకోవడం తప్పులేదు. కానీ కేంద్ర మంత్రి కరోనా భారినపడ్డారు. ఎప్పటికి కోలుకుంటారో తెలియదు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించవచ్చు. ఎంత త్వరగా ప్రారంభిస్తే విజయవాడ ప్రజలు అంత ఆనందిస్తారు. ప్రతిసారీ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ ఉండటం అంత మంచిది కాదు. అయ్యవారు రాలేదని అమ్మవారి పూజలు నిలిపివేయలేం కదా?
భక్తులకు నిరాశేనా..
వచ్చే నెల 17 నుంచి 25 వరకు దుర్గగుడిలో దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. అప్పటికైనా దుర్గగుడి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుందా? రాదా అనే సందేహాలు వస్తున్నాయి. అనేక అవాంతరాలు దాటుకుని దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఎట్టకేలకు పూర్తి చేశారు. అయినా రెండు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడటంతో విజయవాడ ప్రజలు, దుర్గమ్మ భక్తులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా వెంటనే దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభించి విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.











