గూగుల్ తమ ప్లేస్టోర్ నుంచి డిజిటల్ పేమెంట్స్ పేటీఎం యాప్ ను తొలగించింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ద్వారా కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో యాప్‌ను గూగుల్ తొలగించింది. తమ పాలసీలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించినా, అలాంటి యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చట.
యాప్ తొలగించే విషయంపై పేటీఎం ట్విట్టర్ లో స్పందిస్తూ పేటీఎం యాండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండదని పేర్కొన్నది. కొత్తగా ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవాలన్నా లేదా అప్డేట్ చేసుకోవడం కుదరదని తెలిపింది. ‘పేటీఎం యాప్ త్వరలో ప్లే స్టోర్‌లోకి తిరిగి వస్తుంది.. పేటీఎంలో మీ డబ్బులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. యూజర్లు ఆందోళన చెందొద్దు.. ఇప్పటికే డౌన్ లోడ్ చేసి ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన పేటీఎం ద్వారా అన్ని సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి’ అని పేటిఎం పేర్కొంది.
మిగతా యాప్ లు ఓకే…
అయితే గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ మాత్రమే తొలగించింది. పేటీఎం అందించే ఇతర సర్వీసుల్లో పేటీఎం మాల్, పేటీఎం మనీ, పేటీఎం బిజినెస్ యాప్స్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబుటులోనే ఉన్నాయి. ఇప్పటికే యూజర్లు పేటీఎం యాప్ తమ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే గనుక పేటీఎం అందించే అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవాలనుకునేవారు మాత్రం పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోలేరు.
గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించం…
గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి గ్యామ్లింగ్ యాప్ విధానాలను అనుమతించమని పేర్కొంది. భారత్ లో ప్లే గ్యంబ్లింగ్ ఆమోదించే లేదా ప్రోత్సహించే యాప్ లకు సంబంధించిన సమస్యలపై గూగుల్ ప్రస్తావించింది. గూగుల్ ప్లే తమ ప్లే స్టోర్ యూజర్లకు సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. దీంతోపాటు అనేక టూల్స్ కూడా అందిస్తోంది. తమ గ్లోబల్ పాలసీలు ఎల్లప్పుడూ ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించామని గూగుల్ ఒక బ్లాగు పోస్టులో వెల్లడించింది. యాప్‌ల ద్వారా లభించే ఆన్‌లైన్ కాసినోలతో పాటు స్పోర్ట్స్ బెట్టింగ్ వంటి ప్లే గ్యాంబ్లింగ్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.











