హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల నిర్వహణపై తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈసీ కోరింది. రాబోయే ఎన్నికలను ఈవీఎం ద్వారా నిర్వహించాలా? లేక బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా? అనే అంశంపై ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాలను చెప్పాలని పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. ఈచర్యతో రాష్ట్రంలో ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమైంది. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్‌ఎంసీ అధికారులతో ఈమేరకు సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల సంసిద్ధత, కోవిడ్ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు.
ప్రస్తుత హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరి, 2021తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉండడంతో రాజకీయ పార్టీలు కూడా తమతమ కసరత్తును ఇప్పటికే మొదలు పెట్టగా.. ఈసీ సైతం ఎన్నికల నిర్వహణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు లేఖలు రాయడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడికి తెరతీసినట్లయింది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. డివిజన్ల స్థానాలను 150 నుంచి 200 వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బ్యాలెట్ పేపర్లతోనే!…
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలా లేక ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అన్న విషయంలో రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలను తెలుపాలన్నది ఈసీ రాసిన లేఖల సారాంశం. ఈవిఎం ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే ఈవిఎంలను తాకడంతో ఓటర్లకు వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తుంది. బ్యాలెట్ పేపర్లతో అయితే ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. అందుకే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించేందుకే ఎన్నికల సంఘం ఇంట్రస్ట్ గా ఉన్నట్లు సమాచారం. కానీ దీనిపై పార్టీల అభిప్రాయాన్నికూడా తీసుకోవాలని ఎన్నికల సంఘం అనుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణ కసరత్తులో ముందుగా తేలాల్సిన అంశంగా రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిని ప్రాధాన్యతగా తీసుకున్నది.
అభిప్రాయాలకు డెడ్ లైన్…
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీలకు డెడ్ లైన్ ను విధించింది.సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని, ఏమైనా సలహాలు, సూచనలు వుంటే తెలియజేయాలని ఈసీ లేఖలో పేర్కొన్నది. 30వ తేదీ తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని ఎన్నికల సంఘం డెడ్ లైన్ విధించడం గమనార్హం.