మన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ జీవితంపై రూపొందిన ‘మన అంబేద్కర్’ టీవీ సీరియల్ బహుజనులను బాగా ఆకర్షిస్తోంది. మరాఠీలో తెరకెక్కిన సీరియల్ కు ఇది అనువాదం. జీ తెలుగులో ఈ సీరియల్ ప్రసారాలు నిన్న సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. కులవివక్షపై అంబేద్కర్ పోరాటం, ఆయన రాజకీయ జీవితం, సామాజిక న్యాయం కోసం ప్రధానాంశాలుగా ఈ సీరియల్ తెరకెక్కింది. ఈ సీరియల్ ప్రసారం గురించి తెలుసుకున్న దళితులు బ్యానర్లు, హోర్డింగులు కట్టి మరీ ఈ సీరియల్ ను స్వాగతిస్తున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఒక చిన్న గ్రామం రాయకల్ లో ఇలాంటి హోర్డింగులు కనిపించాయి. అక్కడి ప్రగతి యువశక్తి సంఘం ఇలాంటి కార్యక్రమానికి పూనుకుంది. ఫిక్షన్ డ్రామాగా ఈ సీరియల్ ఉంటుంది.
దీనికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. మహానాయకుడులే భీమ్ రావ్ అనే పల్లవితో ఈ పాట ఉంటుంది. నిషాంత్ రాజా సంగీతం సమకూర్చిన ఈ పాటను తెలుగు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడారు. ఫిక్షన్ డ్రామాగా ఈ సీరియల్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా అంబేద్కర్ అంటరాని తనం వల్ల ఎంత వివక్షకు గురయ్యారో ఇందులో ప్రస్తావించారు. బావి వద్ద నీళ్లు తాగడానికి వెళితే అడ్డుకోవడం, దూరం నుంచి గొట్టంతో నీళ్లు పోయడం, స్కూటు నుంచి బయటకు గెంటివేయడం లాంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. తనకెదురైన చేదు అనుభవాల నుంచి ఆయన పాఠాలు నేర్చుకుని ఎలా ఎదిగారు, రాజ్యాంగ నిర్మాణానికి ఎలాంటి బాటలు వేశారు అనే అంశాలను చక్కగా ఆవిష్కరించారు.
మన అంబేద్కర్ పై విమర్శల పర్వం
ఏది చేసినా విమర్శించే వర్గం అంటూ ఒకటుంటుంది. ఈ సీరియల్ మీద కూడా అలాంటి మరకలే పడ్డాయి. అంబేద్కర్ జీవితాన్ని వక్రీకరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. జీ నెట్ వర్క్ అధినేత భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ. ఆయన తన రాజకీయ స్వార్థంతోనే దీన్ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. దళిత ఓటు బ్యాంకు కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది మరో ఆరోపణ. సామాజిక మాధ్యమాలు చురుకుగా ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ వాదం అసలు ఏమిటనే చర్చ కూడా మరో పక్క జరుగుతోంది. అంబేద్కర్ సిద్ధాంతాలు, ఆయన ఆలోచనలు ఎంతటి ప్రమాదకరమో ఊహించిన ఆర్.ఎస్.ఎస్. ఈ సీరియల్ పేరుతో వక్రీకరణకు తెరతీసిందని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ సీరియల్ విషయంలో అంబేద్కర్ వాదులు రెండు వర్గలుగా చీలిపోయినా ఆశ్చరపడాల్సిన పనిలేదు. ఈ వివాదాల మాట ఎలా ఉన్నా ఓ మహనీయుడి చరిత్రను ఇలా సీరియల్ గా తీయాలన్న ఆలోచనను అభినందించాల్సిందే.











