ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు అందర్నీ నివ్వెరపరుస్తున్నాయి. మొన్నటి మొన్న ఓ విషయం వెలుగులోకి వచ్చింది. గుడివాడలో జరిగిన జగన్ సభ కోసం వచ్చిన జనాలకు నిమ్మరసం పంచినందుకు రూ.32 లక్షలు ఖర్చయిందట! ఇదెక్కడి విడ్డూరం అని అంతా ముక్కున వేలేసుకుంటే.. కాదేదీ దోచుకునేందుకు అనర్హం అన్నట్లుగా వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు బట్టబయలు అయింది. ఇప్పుడు ఏకంగా జగన్ సాక్షిగా మరో కుంభకోణం బయటపడింది. అదే ఎగ్ పఫ్ ల స్కామ్.
2019 నుంచి 2024 మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ ల కోసం ఏకంగా రూ.మూడున్నర కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారట. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా వైసీపీ మీద అంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కాస్తా, ఎగ్ పఫ్ రెడ్డిగా నెటిజన్లు మార్చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటే అది వైఎస్ జగన్ ఇల్లు మాత్రమే కాదు, అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీసు కూడా. అందులో బోల్డంతమంది సిబ్బంది అప్పట్లో పని చేసేవారు. వారిలో, అధికారులు ఉంటారు. స్నాక్స్ ఖర్చు బాగానే అవుతుంటుంది. కానీ, ఒక్క మరీ ఎగ్ పఫ్‌ల కోసమే మూడున్నర కోట్లా? చాలా ఓవర్ కదూ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే, అదంతా ప్రజాధనం.. ఈ మూడున్నర కోట్ల రూపాయల ఎగ్ పఫ్ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. గత టీడీపీ హయాంలో మంత్రుల స్నాక్స్ ఖర్చు అన్ని లక్షలా.. అంటూ, అప్పట్లో వైసీపీ ఏ రేంజ్ లో దుష్ప్రచారం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ఈ ఎగ్ పఫ్ ల స్కామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ దుష్ప్రచారమే ఇప్పుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. గత ఐదేళ్లలో వైఎస్ జగన్, ఆయన బృందం తమ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసిందో ఈ స్కామ్ తేటతెల్లం చేస్తోంది.
ఈ ఎగ్ పఫ్ ల కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.71 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్క. అంటే రోజుకి సుమారు రూ.20 వేల ఖర్చు. దీన్నిబట్టి సీఎంవో ప్రతిరోజు 993 ఎగ్ పఫ్‌లను వినియోగించింది. అంటే ఐదేళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్‌లు తినేశారు. అలా అయిదేళ్ల కాలంలో ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు కేవలం ఎగ్ పఫ్ లకే తగలేశారు. దీన్నిబట్టి ప్రజా ధనాన్ని ఎలా పక్కదారి పట్టారో అర్థం చేసుకోవచ్చు. 2019-2024 వరకు జారీ చేసిన అధికారిక జీఓలు, వసూలు చేసిన బిల్లులను జగన్ రెడ్డి రహస్యంగా ఉంచేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక జగన్ ప్రభుత్వం కోట్లాది ప్రజా డబ్బును ఎలా కొల్లగొట్టిందని మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి బయటికి వస్తున్నాయి