ఏలూరు వింతవ్యాధికి కారణాలపై పరిశోధనా సంస్థలు రకరకాల నివేదికలు ఇవ్వడం గందరగోళానికి దారి తీసింది. ఇక్కడ కలకలం రేపిన వింతవ్యాధి మూలాలను కనుగొనేందుకు జాతీయ స్థాయిలో పేరున్న అనేక సంస్థలు రంగంలోకి దిగి 300లకు పైగా శ్యాంపిల్స్ సేకరించాయి. వారం రోజులుగా తాగునీరు, ఏలూరు ప్రజలు తీసుకునే ఆహారం నమూనాలను హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్‌లో పరీక్షించారు. నివేదికలను ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు. అయితే ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలు భిన్న నివేదికలు ఇచ్చాయి. దీనిపై సీఎం సమగ్రంగా సమీక్షలు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎస్ నీలం సాహ్నీని ఆదేశించారు.
ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు
ఏలూరులో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి జిల్లాలో తాగునీరు, ఆహారం, మట్టి నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏలూరు ప్రజలు తినే ఆహారంలో పురుగు మందుల అవశేషాల వల్లే వింతవ్యాధి ప్రబలిందని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నివేదికల్లో వెల్లడించారు. అయితే, ఇప్పటికే వచ్చిన పలు సంస్థల నివేదికల్లో ఆర్గోనో క్లోరిన్, లెడ్, పాదరసం, పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు వెల్లడించారు. ఒక్కోక్కరు ఒక్కో రకంగా నివేదికలు ఇవ్వడంతో సీఎం కూడా గందరగోళానికి గురయ్యారు. దీంతో స్పష్టమైన కారణాలు కనుక్కోవాలని వైద్యాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు.

పురుగు మందుల అవశేషాలే కారణమా?
ఏలూరు ప్రజలు తినే ఆహారంలో పురుగు మందుల అవశేషాలు ఉండటం వల్లే వారు ఫిట్స్ వచ్చి పడిపోయారని జాతీయ పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. కేవలం ఏలూరులోనే ఇలాంటి ఘటన ఎందుకు చోటు చేసుకుంది. అసలు పురుగు మందులు పిచికారి చేయని పంటలే లేవు. అందరూ తినే ఆహారమే ఏలూరు ప్రజలు కూడా తింటున్నారు. అలాంటప్పుడు ఏలూరులోనే ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురుగు మందుల అవశేషాలు ప్రజల శరీరాల్లోకి ఎలా వెళ్లాయనేది నిగ్గు తేల్చాలని, ఆర్కేబీల ద్వారా సేంద్రీయ వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో ఏలూరు ఘటనపై సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.











