వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. 2019లో గన్నవరం వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావును అదే ఏడాది డిసెంబరులో కృష్ణా జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ పదవి పదవి వరించింది. అయితే పదవి చేపట్టిన వెంకట్రావు ఉద్యోగులను వేధిస్తున్నారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. యానియన్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసి చెప్పుకోలేని భాషలో తిడుతున్నాడని ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోషియేషన్ జాతీయ కార్యదర్శి రాంబాబు వెల్లడించారు. ఉద్యోగుల యూనియన్‌ను విచ్ఛినం చేసేందుకు సమయం వృధా చేసుకోకుండా బ్యాంకు అభివృద్దికి యార్లగడ్డ కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వెంకట్రావులను చాలా మందిని చూశామని రాంబాబు హెచ్చరించారు. ఉద్యోగులపై వేధింపులు ఆపకుంటే ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రాంబాబు ప్రకటించారు.
అసలేం జరిగింది
కృష్ణా జిల్లా సహకార బ్యాంకులో గత ఏడాది రూ.40 కోట్ల కుంభకోణం జరిగింది. సహకార బ్యాంకులు వ్యవసాయ రుణాలు మాత్రమే ఇస్తూ ఉంటాయి. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నం సహకార బ్యాంకులో వ్యవసాయ భూములను నివాస స్థలాలుగా ఎక్కువ విలువ చూపించి రూ.40 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అప్పటి బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ కుంభకోణం జరిగినప్పుడు మచిలీపట్నం సహకార బ్యాంకు మేనేజర్‌గా ఉన్న ఓ అధికారిని కేసు నుంచి తప్పించి, ఏజీఎంగా ప్రమోషన్ ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నాయి. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఓ ఉద్యోగి జిల్లాకు చెందిన ఓ మంత్రి బంధువు కూడా కావడంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగ సంఘాల యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగులపై వేధింపులు మానకుంటే..
జిల్లా సహకార బ్యాంకులో 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 2 వేల మంది యూనియన్‌లో ఉన్నారు. అయితే యూనియన్‌లో కొనసాగుతున్న ఉద్యోగులను బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టార్గెట్ చేశారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులపై వేధింపులు మానకుంటే ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి దిగుతాయని రాంబాబు హెచ్చరించారు.
లాక్ డౌన్‌లో బదిలీలు నిషేధమయినా..
కరోనా లాక్ డౌన్ సమయంలో బదిలీలను నిషేధించారు. అయినా యూనియన్‌లో ఉన్నారనే కారణంతో 200 మంది ఉద్యోగులను బదిలీ చేశారని ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు జాతీయ కార్యదర్శి రాంబాబు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగుల బదిలీల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను వేధించే విధానాలు మానుకోకుంటే తాడోపేడో తేల్చుకుంటామని వారు ఘాటుగా హెచ్చరించారు.











