రామ్ ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు .. ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఇదే హాట్ టాపిక్. ఆ మధ్య ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించాడు. జై .. లవ .. కుశ అనే మూడు పాత్రల్లో ఆయన దుమ్మురేపేశాడు. దాంతో ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు రామ్ కూడా అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు. సాధారణంగా ఏ హీరో అయినా స్టార్ డైరెక్టర్లతో ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. కానీ రామ్ .. ఒక కొత్త దర్శకుడితో కలిసి ఈ సాహసం చేస్తుండటం విశేషం.

ఇక రామ్ చేస్తున్నది సాహసమేననడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవలే రామ్ ‘రెడ్’ సినిమా చేశాడు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అయినా ఆయన తన తదుపరి సినిమాలో మూడు పాత్రలను పోషించడానికి రెడీ అవుతుండటం ఆశ్చర్యమే. కథ చెప్పే విధానంలోనే దర్శకుడి టాలెంట్ ఏమిటనేది రామ్ కి అర్థమైపోయిందట. అంతేకాదు కథ కూడా ఆయనకి విపరీతంగా నచ్చిందట. అందువల్లనే రెండో ఆలోచన చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తు ఒక రేంజ్ లో జరుగుతోందట. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన రామ్ ‘రెడ్’ సినిమాలో ముగ్గురు కథానాయికలు మెరిశారు. ఇక కొత్త ప్రాజెక్టులో రామ్ మూడు పాత్రలు చేస్తున్నాడంటే, కథానాయికలు కూడా ముగ్గురు ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి రామ్ సరసన అందాల సందడి చేయనున్న ఆ వయ్యారిభామలు ఎవరనేది చూడాలి. ఇక ఈ మూడు పాత్రల్లో రామ్ ఎలాంటి లుక్స్ ను ట్రై చేయనున్నాడనేది మరో ఆసక్తికరమైన విషయంగానే చెప్పుకోవాలి.











