సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపడమే గాక ఆర్థికంగా గడ్డు కాలంలో ఉన్న భారత్ కు దిశా నిర్దేశం చేసిన ఘనత పీవీ నరసింహారావుది. ప్రధానిగా మాత్రమే గాక స్వాతంత్య్ర సమరయోధుడిగా, సాహితి వేత్తగా, బహు భాష కోవిదుడుగా ఆయన ఎందరికో ఆదర్శం. ఆ మహనీయుడు తెలుగు వాడు అందునా తెలంగాణ వాడు కావడంతో తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పీవీ జయంతి రోజు (జూన్ 28)న సీఎం కేసిఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ ఉత్సవాలు ఏడాది పాటు జరగనున్నాయి. ‘పీవీ మన ఠీవి’ అని చెప్పుకునేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ వేడుకలలో భాగంగా పాల్గొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభోపన్యాసం చేశారు. దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రధాని అయిన వ్యక్తి పి.వి అని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఎన్నో కష్టాలు ఉన్న సమయంలో ప్రధాని పదవిని అధిరోహించారని తెలిపారు. రాజీ లేని పంధాతో దేశ అభివృద్ధికి పీవీ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపిన సమర్థత ఆయనదని చెప్పారు.
పీవీ జీవితం ఎందరో యువ నాయకులకు ఆదర్శమని అన్నారు. అలాంటి మహనీయుడు ఉత్సవాలను నిర్వహించాలనే కెసిఆర్ ఆలోచన సాకారం అయిందని తెలిపారు. పీవీ లాంటి దార్శనీయుడు చరిత్ర నేటి యువతకు తెలియచేస్తామని ఆమె ప్రకటించారు. వినయశీల వ్యక్తిత్వం తో ఏ స్థాయికైనా ఎదుగుతారని పీవీని చూసి నేర్చుకోవాల్సిందేనని ఆమె పిలునిచ్చారు. మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఈ ఉత్సవాలను అతి తక్కువ మందితో నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో యువతకు పుస్తకాలు అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చిన ఆమె ప్రతి నెల రెండు కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.