జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తప్పలేదు. భగీరథ ప్రయత్నం లాగా.. ఒకవైపు పిటిషన్లు హైకోర్టులో ఉండగానే.. వాటి మీద సుప్రీంను ఆశ్రయిస్తూ అటునుంచి తమకు అనుకూల నిర్ణయం రాగలదన్న ఆశతో ఎదురుచూస్తున్న సర్కారుకు మళ్లీ నిరాశ ఎదురైంది. పరిపాలన వికేంద్రీకరణ,సీఆర్డీఏ రద్దు పిటిషన్ లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బుధవారం సుప్రీం కోర్టులో అశోక్ భూషణ్, సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా లతో కూడిన ధర్మాసనం ఎదుటకు ఈ పిటిషన్ వచ్చింది. ఈ అభ్యర్థనను వారు తోసిపుచ్చారు.
హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఏపి ప్రభుత్వ పిటిషన్ ను విచారించలేమన్న సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టులో ఇదే విషయాలపై పిటిషన్లు గురువారం విచారణకు రానున్నాయి. హైకోర్టులోనే మీ వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
ఆ ఆశ కూడా పాయె…
హైకోర్టులో రోజువారీ విచారణ జరిపి నిర్ణీత సమయంలోగా విచారణ ముగించేలా హైకోర్టుకు అదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కూడా సుప్రీం నిరాకరించింది. హైకోర్టు విచారణకు నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టులో విచారణ త్వరగా ముగుస్తుందని అశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
జగన్మోహనరెడ్డి ఆలోచనలకు న్యాయపరంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా నిర్ణయాలు అడుగు ముందుకు పడకుండా స్తంభించిపోతున్నాయి.