క్రికెట్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అందులోనూ ప్రపంచ కప్ క్రికెట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. 1983 భారత క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. కపిల్ దేవ్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ను గెలుచుకున్న సంవత్సరం అంది. ఫైనల్ లో భారత్ జట్టు ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు చరిత్రను తిరగరాసింది. అది భారత జాతికి గర్వకారణంగా నిలిచింది. ఇది జరిగి దాదాపు 37 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఆనాటి మధుర ఘట్టాలను ఇప్పుడు వెండి తెరపై చూస్తే ఎలా ఉంటుంది. ఆ ప్రయత్నంలో తెరకెక్కిన చిత్రమే ‘83’. భారత జట్టు సారథి కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ నటిస్తున్న చిత్రమిది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలపై నీలినీడలు కూడా కమ్ముకున్నాయి. థియేటర్లు ప్రారంభమైతే డిసెంబరులో 25న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు.
నాటి ఆట.. అదో అద్భుతం
ఇక నాటి ప్రపంచ కప్ పోటీలలోకి వెళితే ముఖ్యంగా భారత జట్టు వెస్టిండీస్ జట్టును ఎదుర్కోవడమంటే మాటలు కాదు. పైగా వెస్టిండీస్ జట్టుకు బాహుబలి జట్టుగా పేరుండేది. వరుసగా ప్రపంచ కప్ లు అన్నీ ఆ జట్టుకే దక్కుతుండేవి. పైగా ఫైనల్ లో 73 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోయింది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లను భారత్ జట్టు కోల్పోయింది. చివరికి 183 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ కు ఇచ్చింది. భారత బౌలర్లు విండీస్ టీమ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. తమాషా ఏమిటంటే 73 పరుగులకే ఏడుగురు కత్తి లాంటి భారత బ్యాట్స్‌మెన్ వెనుతిరిగారు. 90 పరుగుల వద్ద 9 మంది భారత బ్యాట్స్ మెన్ ఔటయ్యారు.
లార్ట్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇలా తొలి ప్రపంచ కప్‌ను అందుకుని ప్రపంచానికి తన సత్తా ఏమిటో చూపింది. వెస్టిండీస్ విజయం నల్లేరు మీద నడక అని అందరూ అనుకున్న తరుణంలో భారత్ కు ఊహించని విజయం దక్కింది. సినిమాకు ఇంతకంటే మంచి కథా వస్తువు ఏంకావాలి. దీన్ని సినిమాగా తీయాలనుకున్న ఆలోచన రావడమే తరువాయి నిర్మాణ భాగస్వాములు కూడా పెరిగిపోయారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, ఫాంటమ్ ఫిలింస్, 83 ఫిలిమ్స్ లాంటివన్నీ అసలు నిర్మాతలతో చేతులు కలిపాయి. ఇంతకీ అసలు నిర్మాతలు ఎవరన్నదే సందేహం కదూ. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకునే పేరే నిర్మాతల్లో కనిపిస్తుంది. అంటే దీని వెనుక రణ్ వీర్ సింగ్ కూడా ఉన్నాడన్న మాటే కదా. ఇక ఈ సినిమా దర్శకుడు కబీర్ ఖాన్ కూ ఇందులో భాగముంది. సాజిద్ నడియాద్ వాలా, విష్ణువర్ధన్ ఇందూరి తదితరులంతా నిర్మాణ భాగస్వాములుగా చేరారు.
ఇంతకీ భారత జట్టులో ఎవరెవరు?
భరత జట్టు సారథి కపిల్ దేవ్ కు ఒక విధంగా ఇది బయోపిక్ లాంటిదే. ఆ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషిస్తున్నారు. మరి ఈ జట్టులో మరో మంచి బ్యాట్స్ మన్ గవాస్కర్ మాటేమిటి అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఈ పాత్రను తాహిర్ రాజ్ బాసిన్ పోషిస్తున్నారు. కె. శ్రీకాంత్ గా తమిళ నటుడు జీవా, మొహిందర్ అమర్ నాథ్ గా సాకిబ్ సలీమ్, యశ్ పాల్ శర్మగా జతిన్ శర్మ, సందీప్ పాటిల్ గా చిరాగ్ పాటిల్, కీర్తి ఆజాద్ గా దిన్ కర్ శర్మ, రోగర్ బిన్నీగా నిషాంత్ దహియా, మదన్ లాల్ గా హార్డీ సంధు, సయ్యద్ కిర్మానీగా సాహిల్ కత్తర్,
బల్విందర్ సింగ్ సంధుగా ఎమ్మీ విర్క్, దిలీప్ వెంగ్ సర్కార్ గా అదినాథ్ కొటార్, రవిశాస్త్రిగా ధైర్య కర్వా, సునీల్ వాసన్ గా ఆర్ బద్రీ, పీఆర్ మాన్ సింగ్ గా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నారు. వెస్టిండీస్ జట్టు క్రికెటర్లుగా ఎవరు నటిస్తున్నారనే ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది. తినబోతూ రుచి అడగడమెందుకు.. ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ గా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదిరింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబరు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.











